Site icon NTV Telugu

BRS: కడియంకు చెక్‌ పెట్టేందుకేనా?.. వరంగల్‌ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య!

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

BRS: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీలోనే కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఖరారు చేయగా.. ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కడియం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఆయనకు ఎలాగైన బుద్ధి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం నిలబడితే.. ఆయనకు పోటీగా తాటికొండ రాజయ్యను బరిలో దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Read Also: Kishan Reddy: దేశం బాగుండాలంటే మోడీని గెలిపించాలి..

ఇదిలా ఉండగా.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శుక్రవారం రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో హుటాహుటిన రాజయ్య ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు బయలుదేరారు. భేటీ అనంతరం రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను రాజయ్యకు ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య కాదని కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. దీంతో అసంతృత్తికి గురైన రాజయ్య.. కొన్నాళ్లు మౌనంగా ఉండి.. ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. కానీ, ఇంతవరకు ఏ పార్టీలోనూ చేరలేదు. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే మళ్లీ బీఆర్ఎస్‌లో చేరి వరంగల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది,

Exit mobile version