BRS Party: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి బీఆర్‌ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులను కార్యోణ్ముఖులను చేయాలని, ఎన్నికల శంఖారావంలా ఈ సభలు నిర్వహించాలని పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ గులాబీ శ్రేణులకు సూచించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సభల్లో తెలంగాణ సాధించిన విజయాలపై, బీజేపీ వైఫల్యాలపై తీర్మానాలు చేయనుంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది నేటి సభల్లో పాల్గొననున్నారు.
Read Also: Bhatti Vikramarka : కేసీఆర్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు
ఉదయమే నగరం, పట్టణం, గ్రామమంతటా పార్టీ జెండాలను ఎగరేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధుల సభలో కనీసం ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. రాష్ట్ర, జాతీయ పరిస్థితులపై తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం ఆమోదించనున్నారు. అక్టోబర్ 10న వరంగల్‌లో మహాసభను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.