Site icon NTV Telugu

BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేకే, గద్వాల విజయలక్ష్మీ గుడ్‌బై

Kk

Kk

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవ్వరు చెప్పలేరు. కుడి ఎడమలు అటు ఇటు కాగానే ఎంత మార్పు. మూడు నెలల వరకు కీలక పదవులు అనుభవించిన వాళ్లు.. అధికారం పోగానే ఏదో పోగొట్టుకున్నట్టే ఫీలవుతున్నారో ఏమో తెలియదు గానీ.. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు అధికార పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. అధికారం పోయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా బీఆర్ఎస్‌లో కీలక పదవులు అనుభవించిన కేశవరావు, ఆయన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కారు దిగి హస్తం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అధికారం పోగానే ఇంత మార్పా? అంటూ ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

శనివారం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీ ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని ఆమె తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్తున్నట్లు విజయలక్ష్మీ వెల్లడించారు. తనతో పాటు కొంత మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

కేశవరావు..
పార్టీకి సంబంధించిన అంశాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు కేశవరావు మీడియాతో చిట్‌చాట్ చేశారు. పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. కవిత అరెస్ట్ గురించి కూడా చర్చించామన్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని.. అలాగే తనకు కూడా కేసీఆర్‌పై గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా తనకు బాగా సహకరించారన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నానని.. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన కుమారుడు విప్లవ్.. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పడం మంచిది అని వ్యాఖ్యానించారు.

విప్లవ్..
తాను మాత్రం పార్టీ మారడం లేదని కేశవరావు కుమారుడు విప్లవ్ తేల్చిచెప్పారు. అలాగే తన సోదరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ పార్టీ మారతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తమ నాయకుడు కేసీఆరేనని విప్లవ్ స్పష్టం చేశారు.

Exit mobile version