Jitta Balakrishna Reddy Dead:తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు స్వస్థలం భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు జరగనున్నాయి. రాజకీయ నాయకులు జిట్టా మృతికి సంతాపం తెలుపుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఉద్యమకారుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. బీఆర్‌ఎస్ పార్టీ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. 2009లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో జిట్టా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. 2009లో భువనగిరి అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దానిని బీజేపీలో విలీనం చేశారు.
Also Read: Ganesh Chaturthi 2024: టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో వినాయకుడు.. పక్కనే రోహిత్ శర్మ! వీడియో వైరల్
అనంతర పరిణామాల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కొద్దిరోజులకే 2023 అక్టోబర్ 20న బీఆర్‌ఎస్‌లో చేరారు. జిట్టాకు గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అది కుదరలేదు. కొన్నిరోజులుగా అనారోగ్యం బారినపడిన ఆయన పరిస్థితి విషమించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.