Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు చేస్తామన్నారు.. కానీ ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు అని కుట్ర మొదలు పెట్టారన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్టాండ్‌లు కుదువ పెడుతున్నారని, రేవంత్ రెడ్డి ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని ఆరోపించారు. ఏడాదికి రూ.100 కోట్లు లాభం వచ్చే విధంగా కేసీఆర్ కార్గోను తీసుకు వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్గోను ప్రైవేటుకు అమ్ముతున్నారని మండిపడ్డారు. కమీషన్‌ల కోసం టికెట్ ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. మముల్ని హౌస్ అరెస్ట్ చేసి ఏమి చేస్తారని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ నన్ను కాదు అడిగేది. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీకి చాలా డబ్బులు ఇచ్చాం.. మీ సీఎంని, ఆర్థిక మంత్రిని నిలదీయాలన్నారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఆర్టీసీ ఎండీని కలిసి అడుగుతామన్నారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం ప్రకటించారు. ఈ రోజు ఉదయం బస్ భవన్ కి సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉదయం 8.45కి రేతిబౌలి నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కేటీఆర్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు నిర్ణయించారు. ముందుగానే రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావును సైతం హౌస్ అరెస్ట్ చేశారు.
