BRICS Common Currency: గత కొన్నేళ్లుగా బ్రిక్స్ కరెన్సీ అందుబాటులోకి వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా భారత్‌లో బ్రిక్స్ సదస్సు జరుగుతుండటంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ అంశంపై తాజాగా భారత ప్రభుత్వం కీలక విషయాన్ని పంచుకుంది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఒకే విధమైన ఉమ్మడి కరెన్సీని తెచ్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ ముందుకు రాలేదని భారత్ స్పష్టం చేసింది. న్యూఢిల్లీ ఆతిథ్యంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు) సుధాకర్ దలేలా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రాభావాన్ని తగ్గించడానికి ఒక కామన్ కరెన్సీ వస్తుందన్న వార్తలకు ఈ ప్రకటనతో ముగింపు పడినట్లయింది. అయితే ఉమ్మడి కరెన్సీ లేకపోయినా, సభ్య దేశాలు తమ సొంత (స్థానిక) కరెన్సీలలోనే దైపాక్షిక వ్యాపార లావాదేవీలు జరుపుకోవడంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నాయని, ఇది కొత్త విషయమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కరెన్సీల్లో వ్యాపారం చేయడం వల్ల లావాదేవీల వ్యయం తగ్గడంతో పాటు, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని భారత్ నమ్ముతోంది.
ఇక కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సైతం బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. సభ్య దేశాలన్నీ తమ చెల్లింపుల వ్యవస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానించుకోవాలని, స్థానిక కరెన్సీల్లో వర్తకాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. భారత్ అభివృద్ధి చేసిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా యూపీఐ (UPI) ఈ రోజుల్లో 11 దేశాల్లో చెల్లుబాటు అవుతోందని, బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు కూడా తమ పేమెంట్ సిస్టమ్స్‌ను ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తు సాంకేతికతను కలిసికట్టుగా నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ కూడా స్థానిక కరెన్సీల ద్వారా వర్తకం, పెట్టుబడులను ప్రోత్సహించడంపై జరుగుతున్న చర్చలను సమర్థించింది. అయితే ఈ విషయంలో ప్రతి దేశ ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయని, అందరికీ ఒకే నియమం వర్తించదని (no ‘one-size-fits-all’) గ్రహించి, జాతీయ హక్కులను గౌరవిస్తూ ముందడుగు వేయాలని పేర్కొంది.
మరొకవైపు, బ్రిక్స్ దేశాలు కామన్ కరెన్సీ వైపు అడుగులు వేస్తున్నాయనే ఊహాగానాలు అమెరికాకు తీవ్ర ఆందోళన కలిగించాయి. డాలర్ స్థానాన్ని భర్తీ చేసేలా బ్రిక్స్ కొత్త కరెన్సీని తెస్తే, ఆయా దేశాలపై 100 శాతం సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తామని, అమెరికా మార్కెట్‌కు వీడ్కోలు చెప్పాల్సి వస్తుందని గతంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ సమూహం అత్యంత శక్తివంతమైన శక్తిగా ఎదుగుతోంది. ప్రారంభంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికాలతో కూడిన ఈ కూటమిలో.. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియాతో పాటు ఇండోనేషియా కూడా చేరాయి. వీటితో పాటు మలేషియా, నైజీరియా, థాయిలాండ్, వియత్నాం వంటి అనేక దేశాలు భాగస్వామ్య దేశాలుగా మారాయి. ప్రస్తుతం 11 ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థలతో కూడిన బ్రిక్స్.. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, గ్లోబల్ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 26 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తూ గ్లోబల్ మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరుకుంది.

