NTV Telugu Site icon

Bray Wyatt Dead: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!

Bray Wyatt

Bray Wyatt

Former WWE Champion Bray Wyatt Dies At 36 From Heart Attack: ప్రపంచ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్‌ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు. మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ గుండెపోటుతో కన్నుమూసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్‌ పాల్ ‘ట్రిపుల్ హెచ్’ లెవెస్కీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. విషయం తెలిసిన డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

బ్రే వ్యాట్ మృతిపై ట్రిపుల్‌ హెచ్‌ తన ఎక్స్ (ట్విటర్‌) వేదికగా స్పందించాడు. ‘డబ్ల్యూడబ్ల్యూఈ హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌ మైక్‌ రొటుండా (బ్రే వ్యాట్ తండ్రి) నుంచి బాధాకరమైన వార్త వచ్చింది. మా డబ్ల్యూడబ్ల్యూఈ కుటుంబంలోని సభ్యుడు విండం రొటుండా కన్నుమూశాడు. వ్యాట్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ విషాద సమయంలో వారి ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నా’ అని ట్రిపుల్‌ హెచ్‌ ట్వీట్ చేశాడు. వ్యాట్ అసలు పేరు ‘విండమ్ రొటిండా’.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బ్రే వ్యాట్.. డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు దూరంగా ఉంటున్నాడు. బహిర్గతం చేయలేని ఆరోగ్య సమస్యతో అతడు బాధపడుతున్నాడని సమాచారం. డబ్ల్యూడబ్ల్యూఈతో 2009లో ఒప్పందం చేసుకున్న వ్యాట్.. 2022 వరకు పోటీల్లో పాల్గొన్నాడు. మూడుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌గా అతడు నిలిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ను ఒకసారి, రెండుసార్లు యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ను వ్యాట్ సొంతం చేసుకున్నాడు.

Also Read: Virat Kohli: విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్‌.. ఇంకోసారి చేయొద్దంటూ..!

బ్రే వ్యాట్ తండ్రి హాల్‌ ఆఫ్‌ ఫేమర్ మైక్‌ రొటుండా, తాత బ్లాక్‌జాక్‌ ముల్లిగన్ కూడా ఫ్రొఫెషనల్‌ రెజ్లర్ కావడం విశేషం. వ్యాట్ కుటుంబంలో మరికొందరు రెజ్లర్లు కూడా ఉన్నారు. అతడి మేనమామలు బారీ, కెండల్ విండ్‌హామ్ కూడా రెజ్లింగ్ ప్రపంచంలో కెరీర్‌ను కొనసాగించారరేట. రెజ్లింగ్ ప్రపంచంలో బ్రే వ్యాట్ వంశం లోతుగా పాతుకుపోయింది. బ్రే వ్యాట్ మూడవ తరం రెజ్లర్. బ్రే వ్యాట్ ఈ ఏడాది జనవరిలో జరిగిన రాయల్ రంబుల్ రెజ్లింగ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. 2009లో మొదలైన బ్రేవ్యాట్‌ రెజ్లింగ్ ప్రయాణం.. 2023తో ముగిసింది.