Site icon NTV Telugu

WHO Chief: బ్రేవ్ గర్ల్‌.. తమ్ముడికి రక్షణ కవచంలా.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ప్రశంసలు

Syria Girl

Syria Girl

WHO Chief: భూకంపం కారణంగా టర్కీలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాలను తొలగిస్తూ, వాటి కింద చిక్కుకున్న వారిని ఆసుపత్రికి తరలించి, ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులను కలచి వేస్తోంది. ఏడేళ్ల సిరియన్ బాలిక శిథిలాల కింద చిక్కుకుని కూడా, తన తమ్ముడికి రక్షణ కవచంలాగా తమ్ముడిని కాపాడే ప్రయత్నం చేస్తోంది.

తమ్ముడి తలకు ఆ బాలిక చెయ్యిని అడ్డుపెట్టి తమ్ముడిని కాపాడే ప్రయత్నం చేసింది. ప్రాణాంతక పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి తన తమ్ముడిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనకంటే చిన్నవాడైన సోదరుడికి ధైర్యం చెబుతూ, సాయం కోసం ఎదురుచూసిన బాలిక, తమ్ముడిని కాపాడుకున్న తీరును కళ్ళకు కట్టినట్టు చూపించే ఓ చిత్రం, తమ్ముడి కోసం ఆ బాలిక తాపత్రయపడింది. ఏడేళ్ల సిరియన్ బాలిక శిథిలాల కింద తన తమ్ముడిని కాపాడుతున్నట్లు చూపించే కదిలే వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.ఈ ధైర్యవంతమైన అమ్మాయికి అంతులేని ప్రశంసలు ఆయన రాసుకొచ్చారు. గడ్డకట్టే వాతావరణంలో శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాలను రక్షించేందుకు రక్షకులు పరుగు పరుగున ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య బుధవారం 15,000కి చేరుకుంది.

 

ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా కూడా ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. 17 గంటల పాటు శిథిలాల కింద ఉండగా తమ్ముడి తలపై చేయి వేసి కాపాడిన 7 ఏళ్ల బాలిక క్షేమంగా బయటపడింది. దీనిని ఎవరూ షేర్ చేయడం లేదు.. చనిపోతే అందరూ షేర్ చేస్తారు! షేర్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. టర్కీ-సిరియా సరిహద్దు ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప జోన్లలో ఒకటి. తూర్పు ఎర్జింకన్ ప్రావిన్స్‌లో 33,000 మంది మరణించిన 1939 నుంచి సోమవారం నాటి భూకంపం టర్కీ చూసిన అతిపెద్దది. ప్రాణాలతో బయటపడిన వారు ఆహారం, ఆశ్రయం కోసం పెనుగులాడుతున్నారు.

 

Exit mobile version