NTV Telugu Site icon

Botsa Satyanarayana: సీఎం ఇంటిని ముట్టడిస్తానని చెప్పడం సరికాదు

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేయాలంటూ విజయవాడలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త‌మ ప్రభుత్వం అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్ని పరిష్కరిస్తోంద‌ని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను ప‌రిష్కరించ‌డానికి త‌మ‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సీపీఎస్‌ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు. 55 వేల ప్రభుత్వ స్కూళ్లను నాడు నేడు ద్వారా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు.

యూటీఎఫ్ సభ్యులు సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులు తొందరపడి సీఎంవో ముట్టడికి వెళ్లే ప్రయ‌త్నాలు చేస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. స‌మ‌స్యల ప‌రిష్కారానికి కమిటీ వేశామని, ఆ కమిటీనే అన్ని అంశాల‌ను పరిశీలిస్తుందన్నారు. ఇదే విష‌యంపై మళ్లీ ఓ సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. కాగా సీపీఎస్ రద్దు కోసం ఆందోళన చేపడుతున్న ఉపాధ్యాయులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పోలీసులు ఉపాధ్యాయులను, యూటీఎఫ్ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేకు షాడోగా మరో నేత ?