ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో మారణహోమం సృష్టించిన నిందితులు తండ్రి, కొడుకులిద్దరూ పాకిస్థాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడు నవీద్ అక్రమ్ తల్లి వెరీనా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘నా కొడుకు లాంటి కొడుకు కావాలని ఎవరైనా కోరుకుంటారు.’’ అని వ్యాఖ్యానించింది. దాడికి కొన్ని గంటల ముందు కూడా తనతో మాట్లాడాడని.. తన కొడుకు అలా చేశాడంటే నమ్మలేకపోతున్నట్లు వాపోయింది. తన కొడుకు చాలా మంచివాడని వెనకేసుకొచ్చింది.
తన కొడుకు ఉగ్రవాదంలో పాల్గొన్నాడంటే నమ్మలేకపోతున్నానని.. అసలు వాడి దగ్గర తుపాకీ లేదని వెరీనా చెప్పుకొచ్చింది. ఎక్కువగా బయటకు వెళ్లడని.. స్నేహితులు కూడా ఎవరూ లేరని పేర్కొంది. మద్యపానం.. ధూమపానం అలవాటే లేదని.. చెడు ప్రదేశాలకు కూడా వెళ్లడని తెలిపింది. పనికి వెళ్తాడు.. తిరిగి ఇంటికొస్తాడు.. జిమ్‌కు మాత్రం వెళ్తాడని చెప్పుకొచ్చింది. అంతే తప్ప ఇంకేమి చెడ్డ అలవాట్లు లేవని పేర్కొంది. చాలా మంచివాడని.. ఎవరైనా అలాంటి కొడుకు కావాలని ఏ తల్లైనా కోరుకుంటుందని వెరీనా తెలిపింది.
నిందితులు సాజిత్ అక్రమ్ (50), కొడుకు నవీద్ అక్రమ్ (24) చేపల వేటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. కానీ వారు వెళ్లింది మనుషులను వేటాడేందుకు అని వెరీనా గుర్తించలేకపోయింది. నవీద్ అక్రమ్ చాలా రోజులుగా ఐసిస్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు కలిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఏ మాత్రం అనుమానం రాకుండా తండ్రి, కొడుకులిద్దరూ మసులుకున్నట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం.. నవీద్ అక్రమ్ గతంలో సిడ్నీలోని హెకెన్‌బర్గ్‌లోని అల్-మురాద్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖురాన్ అధ్యయనాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు 2024లో కొనుగోలు చేసిన మూడు బెడ్‌రూమ్‌ల ఇంట్లో తల్లిదండ్రులు, తమ్ముళ్లతో కలిసి నివసిస్తున్నాడు. నవీద్‌కు చేపలు పట్టడం, ఈత కొట్టడం, స్కూబా డైవింగ్, వ్యాయామం చేయడం అలవాట్లు ఉన్నాయి. వారాంతంలో చేపల వేట కోసం సిడ్నీకి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెర్విస్ బేకు వెళ్తున్నట్లు తండ్రీకొడుకులు బంధువులకు చెప్పినట్లుగా దర్యాప్తు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుడి సహా 16 మంది మృతి. పలువురు గాయపడ్డారు.
