Site icon NTV Telugu

Bollywood on Alert: ఇండస్ట్రీలో మళ్లీ అండర్‌వర్ల్డ్ నీడలు?.. బాలీవుడ్‌ను వణికిస్తున్న గ్యాంగ్‌స్టర్!

Bollywood Underworld

Bollywood Underworld

Bollywood on Alert: బాలీవుడ్ నటులను ఓ భయం వెంటాడుతోంది. ఆ భయం ఏంటో కాదు.. లారెన్స్ బిష్ణోయ్. ఆ గ్యాంగ్ స్టార్ జైల్లో ఉన్నాడు కదా? అనే సందేహం రావొచ్చు. లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నప్పటికీ బయట పెద్ద సామ్రాజ్యమే ఉంది. ఈ గ్యాంగ్ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలను వణికిస్తోంది. ఇటీవల.. రణ్‌వీర్‌ సింగ్ నటించిన ‘ధురంధర్’ భారీ విజయాన్ని సాధించింది. ‘ధురంధర్ 2’పై కూడా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో హీరో ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. మంగళవారం రణ్‌వీర్‌‌కు వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ సందేశం వచ్చిన వెంటనే రణ్‌వీర్‌ ఇంటి వద్ద పోలీసుల పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. బెదిరింపు పంపిన వ్యక్తి తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడినని చెప్పడంతో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్యాంగ్ పేరు బాలీవుడ్ చుట్టూ తిరుగుతోంది. 90వ దశకంలో ఉన్న అండర్‌వర్ల్డ్ భయం మళ్లీ వస్తుందా? అనే సందేహం తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

READ MORE: Congress MPs vs Speaker: విపక్ష ఎంపీల మరో వీడియో విడుదల చేసిన కేంద్రం

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చిన కొత్తలో లారెన్స్ బిష్ణోయ్ పేరు మొదట పెద్దగా వినిపించింది. బ్లాక్‌బక్ కేసు నేపథ్యంలో 2018లో సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరికలు వచ్చాయి. అతని ఇంటి వద్ద రేక్కీ చేసిన ఘటన సైతం బయటపడింది. 2022లో పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత ఈ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. సల్మాన్‌తో స్నేహం ఉందని చెబుతూ గిప్పీ గ్రేవాల్ ఇంటిపై దాడి జరిగింది. తర్వాత బాబా సిద్దీకీ హత్య బాధ్యత కూడా ఈ గ్యాంగ్ తీసుకుంది. మునవ్వర్ ఫారూఖీ, కపిల్ శర్మ వంటి ప్రముఖుల పేర్లు సైతం బెదిరింపుల జాబితాలో వినిపించాయి. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు, ఇటీవల దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రణ్‌వీర్‌ సింగ్‌కు బెదిరింపులు రావడం మరో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నప్పటికీ.. బయట జరిగే ఈ సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

READ MORE: Chiranjeevi: ‘యుఫోరియా’లో మెగాస్టార్? గౌతమ్ మీనన్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ చిరంజీవినే!

ఇది చూసి చాలామందికి 1990ల కాలం గుర్తుకు వస్తోంది. అప్పట్లో సినిమాలకు బ్యాంకుల నుంచి రుణాలు లభించేవి కాదు. నిర్మాతలు ప్రైవేట్ ఫండింగ్‌పై ఆధారపడేవారు. ఈ పరిస్థితిని అండర్‌వర్ల్డ్ వాడుకుంది. సినిమా డబ్బు వాళ్లదైతే నిర్ణయాలు సైతం వాళ్ల చేతిలో ఉండేవి. ఈ కారణంగా చాలా పెద్ద సంఘటనలు జరిగాయి. టీ-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య దేశాన్ని కుదిపేసింది. రాకేశ్ రోషన్‌పై సైతం కాల్పులు జరిగాయి. సునీల్ శెట్టి కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. మణీషా కోయిరాలా డబ్బు ఇవ్వనందుకు ఆమె సెక్రటరీని హత్య చేసిన ఘటన కుదిపేసింది. విదేశాల్లో జరిగే పార్టీలకు నటులను బలవంతంగా పిలిపించడం, వెళ్లకపోతే బెదిరించడం వంటి సంఘటనలు అప్పట్లో సాధారణమయ్యాయి. కొంతమంది నటీమణులతో గ్యాంగ్‌స్టర్ల సంబంధాలు సైతం వార్తల్లో నిలిచాయి. ఈ కథలన్నీ అప్పటి బాలీవుడ్‌పై నలుపు మచ్చలా మిగిలాయి. తర్వాత సినిమాలకు ‘ఇండస్ట్రీ’ హోదా రావడంతో బ్యాంకుల నుంచి నిధులు అందుబాటులోకి వచ్చాయి. అండర్‌వర్ల్డ్ ప్రభావం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ బెదిరింపులు, వసూళ్ల వార్తలు వినిపించడంతో ఇండస్ట్రీలో ఆందోళన పెరుగుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌కు వచ్చిన తాజా బెదిరింపు ఘటన బాలీవుడ్‌ను మరోసారి అప్రమత్తం చేసింది. గతంలోని చీకటి రోజులు తిరిగి రావొద్దనే భయం సినీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Exit mobile version