BMC Election Results: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ముంబై రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మొత్తం 227 వార్డుల ఫలితాలు ప్రకటించగా, దాదాపు 25 ఏళ్లుగా ఠాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న BMCలో ఈసారి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ–షిండే శివసేన కూటమి కలిసి మొత్తం 118 సీట్లు గెలుచుకుంది. అధికారానికి అవసరమైన మెజారిటీ 114 సీట్లు కాగా, కూటమి ఆ సంఖ్యను నాలుగు సీట్ల తేడాతో దాటింది. 2017లో కేవలం 82 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి తన గత రికార్డును దాటేసింది. కేవలం బీజేపీ 89 వార్డుల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ గెలిచిన అభ్యర్థులకు మొత్తం 11,79,273 ఓట్లు వచ్చాయి. ఇది గెలిచిన అభ్యర్థుల ఓట్లలో 45.22 శాతం, మొత్తం పోలైన ఓట్లలో 21.58 శాతం.
READ MORE: TDP Vs YCP Leaders Fight: కాకినాడలో టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..
ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు 65 సీట్లు వచ్చాయి. వారికి మొత్తం 7,17,736 ఓట్లు పడ్డాయి. గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం 27.52 కాగా, మొత్తం పోలింగ్‌లో ఠాక్రే వర్గం వాటా 13.13 శాతం. రెండో స్థానంలో నిలిచినా, BMC అధికారానికి మాత్రం దూరమయ్యారు. మరోవైపు.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 వార్డుల్లో గెలిచింది. ఈ పార్టీకి మొత్తం 2,73,326 ఓట్లు వచ్చాయి. గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం 10.48 కాగా, మొత్తం పోలింగ్‌లో 5 శాతం వాటా దక్కింది. కాంగ్రెస్‌కు 24 సీట్లు లభించాయి. మొత్తం 2,42,646 ఓట్లు వచ్చాయి. గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం 9.31. కొన్ని చోట్ల వంచిత్ బహుజన్ ఆఘాడితో కలిసి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ ప్రదర్శన బలహీనంగా కనిపించింది.
READ MORE: Mauni Amavasya 2026: రేపు ఆదివారం మౌనీ అమావాస్య.. ఇవి పాటిస్తే మంచి ఫలితాలు!
ఇతర పార్టీల ఫలితాలు..
AIMIMకు 8 సీట్లు, 68,072 ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు 6 సీట్లు, 74,946 ఓట్లు లభించాయి. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీకి 3 సీట్లు, 24,691 ఓట్లు వచ్చాయి. శరద్ పవార్ వర్గం ఎన్సీపీకి ఒక్క సీటే దక్కింది, 11,760 ఓట్లు వచ్చాయి. సమాజవాదీ పార్టీకి 2 సీట్లు, 15,162 ఓట్లు లభించాయి. మొత్తం పోలింగ్ విషయానికి వస్తే 54,64,412 ఓట్లు పడగా, 11,677 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. మొత్తం పోలింగ్ శాతం 47.72గా నమోదైంది. కూటముల పరంగా చూస్తే, ముంబై, థానే, కల్యాణ్-డొంబివ్లీ, వసాయి-విరార్, భివండి, పణవెల్ ప్రాంతాల్లో బీజేపీ–శిందే శివసేన కలిసి పోటీ చేశాయి. పుణే, పింపరి-చించవాడ్‌లో అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాల ఎన్సీపీ కూటమి ఉంది. పుణేలో ఉద్ధవ్–రాజ్ ఠాక్రేలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశారు. నవి ముంబై, మీరా-భాయందర్, ఉల్హాసనగర్‌లలో బీజేపీ, శిందే వర్గం వేర్వేరుగా పోటీ చేశాయి. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్, ప్రకాశ్ ఆంబేడ్కర్ పార్టీ కలిసి ఎన్నికల్లో నిలిచాయి. ఈ ఫలితాలతో ముంబై రాజకీయాల్లో పెద్ద మార్పు ఖాయమైంది. ఎన్నాళ్లుగానో ఠాక్రే కుటుంబానికి అజేయ కంచుకోటగా ఉన్న BMCలో ఇప్పుడు బీజేపీ–శిందే శివసేన కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
