Nigeria: ఉత్తర నైజీరియాలో మరో రక్తసిక్త దాడి జరిగింది. నైజర్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు 30 మందికి పైగా చంపి, అనేక మంది గ్రామస్థులను అపహరించారని ఆదివారం పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే ఈ ప్రాంతం హింస, అభద్రతతో పోరాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం నైజర్ రాష్ట్రంలోని బోర్గు స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని కసువాన్-దాజీ గ్రామంలో ఈ దాడి జరిగింది.
READ ALSO: Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్ కు అత్యాధునిక స్వదేశీ నౌక.. ‘సముద్ర ప్రతాప్’ ప్రారంభానికి సిద్ధం
ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. సాయుధులైన దుండగులు అకస్మాత్తుగా గ్రామంలోకి ప్రవేశించి ప్రజలపై నేరుగా కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత, దుండగులు స్థానికంగా ఉన్న మార్కెట్‌కు, అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు. దీని కారణంగా గ్రామంలో తీవ్ర నష్టం వాటిల్లింది. కసువాన్-దాజీపై దాడి చేసిన సాయుధ వ్యక్తులు నేషనల్ పార్క్ ఫారెస్ట్, కాబే జిల్లా నుంచి వచ్చారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో విస్తారమైన అడవులు ఉన్నాయి. ఇవి సాయుధ ముఠాలకు దాక్కునే ప్రదేశాలుగా పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. కసువాన్-దాజీ గ్రామానికి సమీపంలో పాపిరి కమ్యూనిటీ నివసిస్తుంది. గత నవంబర్‌లో ఒక కాథలిక్ పాఠశాల నుంచి 300 మందికి పైగా పిల్లలు, ఉపాధ్యాయులను అపహరించారు.
తాజాగా జరిగిన దాడిలో కనీసం 30 మంది మరణించారని నైజర్ రాష్ట్ర పోలీసు ప్రతినిధి వాసియు అబియోడున్ తెలిపారు. అయితే కొంతమంది గ్రామస్థులు మాట్లాడుతూ.. మృతుల సంఖ్య 37 కంటే ఎక్కువగా ఉండవచ్చని, చాలా మంది ఇంకా కనిపించడం లేదని చెబుతున్నారు. దాడి జరిగినప్పటి నుంచి భద్రతా దళాలు ఇంకా తమ గ్రామానికి రాలేదని పలువురు గ్రామస్థులు వాపోతున్నారు. అపహరణకు గురైన వ్యక్తుల కోసం వెతకడానికి దళాలను మోహరించామని పోలీసులు చెబుతుండగా, తాము పోలీసులు లేదా సైన్యం ఉనికిని చూడలేదని గ్రామస్థులు పేర్కొన్నారు. వాస్తవానికి నైజీరియా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం. కానీ అనేక మారుమూల ప్రాంతాలలో భద్రత చాలా బలహీనంగా ఉంటుంది. నేరస్థుల ముఠాలు, సాయుధ నేరస్థులు ఈ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ, తరచుగా గ్రామాలపై దాడి చేస్తున్నారు.
READ ALSO: Sarfaraz Khan: దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదుగా.. పాపం సర్ఫరాజ్ ఖాన్!