India vs Pakistan: బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్‌లో రచ్చ.. పాక్ ఆటగాళ్లతో కలిసి అంపైర్ ‘జెట్ క్రాష్’ సంబరాలు

Blind Cricket Asia Cup Final

Blind Cricket Asia Cup Final

India vs Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ గొడవ ఇప్పుడు బ్లైండ్ క్రికెట్ దాకా పాకింది. బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ (Blind Cricket Asia Cup) ఫైనల్ తర్వాత ఒక పాకిస్థానీ అంపైర్ ప్రవర్తనపై ఇండియన్ టీమ్ (Indian team) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైరల్ అవుతున్న ఒక వీడియోలో పాకిస్థానీ అంపైర్ ప్లేయర్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించడం, ఆ సమయంలో ఫైటర్ జెట్ క్రాష్ (fighter jet crash) అయినట్లు సైగలు చేయడం ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసింది.

మ్యాచ్ అఫీషియల్స్ ఏ ఒక్క టీమ్ వైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉండాలి కానీ, ఇలా ప్లేయర్స్‌తో కలిసి సంబరాలు చేసుకోవడం ఏంటని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా (CABI) అంపైర్ నిష్పక్షపాతంపై ప్రశ్నలు లేవనెత్తింది. టోర్నీ మొత్తం ఈ అంపైర్ అంపైరింగ్ చేసినా, ఇలా పాకిస్థాన్ టీమ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదని సీఏబీఐ (CABI) స్పష్టం చేసింది. అసలే వర్షం వల్ల ఫైనల్ మ్యాచ్ రద్దవడం, పాకిస్థాన్‌ను విన్నర్‌గా ప్రకటించడంపై అప్పటికే ఇరు జట్ల మధ్య టెన్షన్ నడుస్తోంది. ఢాకాలో జరగాల్సిన బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్ వర్షం కారణంగా ఆడలేకపోయారు. రిజర్వ్ డే కూడా లేకపోవడంతో, మెరుగైన రన్ రేట్ ఆధారంగా పాకిస్థాన్‌ను ఛాంపియన్ (champion) గా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఇండియన్ టీమ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఫైనలే జరగనప్పుడు, రిజర్వ్ డే కూడా లేనప్పుడు ఇద్దరినీ జాయింట్ విన్నర్స్ గా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేసింది.

ఈ వివాదం మరింత ముదరడానికి కారణం వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (WBCC) ఛైర్మన్, పాకిస్థాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ అయిన సుల్తాన్ షా (Sultan Shah) తీసుకున్న నిర్ణయమే అని తెలుస్తోంది. జాయింట్ విన్నర్స్‌గా ప్రకటించాలన్న టెక్నికల్ కమిటీ సిఫార్సును ఆయన పక్కనపెట్టి, పాకిస్థాన్‌నే విన్నర్‌గా ప్రకటించాలని మ్యాచ్ రిఫరీకి ఆదేశాలు ఇచ్చారట. దీనిపై సీఏబీఐ సెక్రటరీ శైలేంద్ర (Shailendra) మండిపడ్డారు. గ్రౌండ్‌లో ఫైనల్ ఆడకుండానే టైటిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నెట్ రన్ రేట్ అనేది లీగ్ స్టేజ్ (league stage) లో క్వాలిఫికేషన్ కోసం వాడతారు కానీ, ఫైనల్‌కు కాదని ఆయన అన్నారు. 2016లో టైటిల్ గెలిచిన భారత్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ (defending champion) గా బరిలోకి దిగింది. గ్రూప్ స్టేజ్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయి, పాయింట్స్ టేబుల్ లో పాక్ టాప్‌లో నిలిచింది. ఇక బంగ్లాదేశ్ (Bangladesh) పై గెలిచి భారత్ ఫైనల్ చేరింది.

పాకిస్థాన్‌ను విన్నర్‌గా ప్రకటించిన తర్వాత భారత ఆటగాళ్లు ప్రెజెంటేషన్ సెర్మనీకి కూడా హాజరు కాలేదు. అంతేకాదు, ఈ గొడవకు పరిష్కారం దొరికే వరకు భవిష్యత్తులో పాకిస్థాన్‌తో ఆడే మ్యాచ్‌లను నిరాకరించే అవకాశం ఉందని సీఏబీఐ వార్నింగ్ ఇచ్చింది. ఇక, ఈ తాజా గొడవతో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ (Haris Rauf) పాత విషయం కూడా మళ్లీ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 2025 ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన సూపర్-4 (Super-4) మ్యాచ్‌లో రవూఫ్ కూడా ఇలాగే ఫైటర్ జెట్ కూల్చినట్లు సైగలు చేసి, ఆరు వేళ్లు చూపిస్తూ ట్రోల్ అయ్యాడు. అప్పట్లో ఇండియా-పాక్ మిలిటరీ టెన్షన్స్ (military tensions) టైమ్‌లో పాక్ చేసిన క్లెయిమ్స్ తో ఆ సైగలను ముడిపెట్టి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బ్లైండ్ క్రికెట్ అంపైర్ వీడియోతో ఇండియా-పాక్ మ్యాచ్‌లలో ఇలాంటి సైగల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.