NTV Telugu Site icon

Shivarajkumar: స్టార్ హీరో ప్రచారంపై బీజేపీ అభ్యంతరం.. ఈసీకి ఫిర్యాదు

Siva

Siva

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ప్రధాన పార్టీలు ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు సినీ ప్రముఖులను కూడా రంగంలోకి దించాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆయా ప్రాంతీయ పార్టీలన్నీ తారలను రంగంలోకి దించాయి. అయితే కర్ణాటకలో హీరోలపై ప్రచారంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. భార్య తరపున ప్రచారం చేస్తున్న స్టార్ హీరో సినిమాలు బ్యాన్ చేయాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరింది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తరపున నటుడు శివరాజ్‌కుమార్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన సినిమాలు, ప్రకటనలు, బిల్‌బోర్డ్‌ల ప్రదర్శనలను పూర్తిగా నిషేధించాలని బీజేపీ శుక్రవారం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇక శివరాజ్‌కుమార్ సతీమణి గీతా శివరాజ్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో షిమోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ రఘు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. శివరాజ్‌కుమార్ సినిమాలు ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ముగిసేదాకా ఆయన సినిమాలు, ప్రచారాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక చివరి విడత జూన్ 1న ముగియనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.