Telangana BJP: తెలంగాణ లో బిజెపి గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ ఊపు తగ్గిందని విస్తృత ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అధికారం లోకి వస్తుందని అనుకున్న ఆ పార్టీ…కనీసం రెండు అంకెల సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయనీ కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలోని సామాజిక సమీకరణాలు ను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ సెంట్రల్ టీమ్ లు, సర్వే ఏజెన్సీలు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు సమాచారం. దీంతోఎన్నికలకు బిజెపి కొత్త అస్త్రం బయటకు తీయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ ఆయుధం బీసీ మంత్రమేనని పార్టీలో చర్చ జరుగుతోంది.
పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన బీజేపీ హైకమాండ్…ఇప్పుడు కేంద్రమంత్రివర్గంలోకి బీసీ అయిన లక్ష్మణ్ గాని లేదా బండి సంజయ్ గానీ, తీసుకొనే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తే…బీసీనే ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేస్తుందని పార్టీలో హైప్రొఫైల్ నేతలు అంటున్నారు. ఎవరు సీఎం అభ్యర్థి అని కాకుండా బీసీ అవుతాడని చెప్పేందుకు రెడీ అయిందని చెబుతున్నారు. బీసీలో బలమైన సామాజిక వర్గాలైన ముదిరాజ్, మున్నూరు కాపులు తమతో అటాచ్ అయ్యారన్న భావనతో ఆ పార్టీ ఉంది. బీసీని అనౌన్స్ చేస్తే…గతంలో టిడిపికి గట్టి ఓటు బ్యాంక్ గా ఉన్న బీసీ సామాజిక వర్గాలు తమ వైపుకి వస్తారని ఆశిస్తోంది. టీడీపీకి బీసీలు అండగా నిలిచినా….వారికి సీఎం అయ్యే అవకాశం రాలేదని బీజేపీలో ఆ అవకాశం వస్తుందని అంటున్నారు… తమ స్ట్రాటజీ వర్కవుటయితే…టిడిపి లో యాక్టివ్ గా ఉండి ఇప్పుడు BRS లో ఉన్నవారు కమలం తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉందని వాళ్ళు అంటున్నారు.
సామాజిక సమీకరణాల్లో దిట్టయిన అమిత్ షా…రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన అప్పటప్పటి నుంచి సోషల్ ఇంజినీరింగ్ లెక్కలు వేసుకుంటున్నారట. ఆయన శిష్యుడు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ బన్సల్ కూడా అదే పనిలో ఉన్నారట. యూపీలో సక్సెస్ అయినట్టే ఇక్కడ కూడా వ్యూహ రచన చేస్తున్నారట. రెడ్డి ఓట్లను చీల్చడం, బీసీ ఓట్లను గంప గుత్తగా వేయించుకోవడం బీజేపీ స్ట్రాటజీగా కనపడుతోంది. అయితే, ఏ మేరకు సక్సెస్ అవుతారు.,.. తెలంగాణ ప్రజలు కమలం పార్టీకి ఎంత వరకు జై కొడతారో చూడాలి.
