Vizag Fishing Harbour Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఈ విషయంపై కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలతో సంప్రదింపులు జరిపారు.. విశాఖలో జరిగిన నష్టంపై వివరణ ఇచ్చారు.. తగిన సహాయం కోసమై విజ్ఞప్తి చేశారు.. దీనిపై కేంద్రం మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఆ తర్వాత జీవీఎల్ తెలిపారు..
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ఘటన దురదృష్టకరమన్న జీవీఎల్.. అటు బోట్లను, ఇటు ఉపాధిని కోల్పోయిన మత్స్యకారులకు మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాను. ఇప్పటికే ఈ విషయం మీద కేంద్ర మత్స్యకార మంత్రిత్వ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలకి జరిగిన సంఘటన గురించి వివరించాను.. కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర మత్స్య శాఖ నుంచి నష్టపోయిన మత్స్యకారులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాను అన్నారు. మంగళవారం ఉదయం ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో బాధిత కుటుంబాలతో, బాధిత మత్స్యకారులతో సమావేశం నిర్వహించి వారికి తగిన సహాయం కోసమై తోడుగా నిలబడతాను అని ప్రకటించారు. మత్స్యకారులు ఈ సమయంలోనే ధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలని.. వారికి కేంద్ర స్థాయిలో ఏమేమి చేయగలనో అన్నీ చేస్తాను అన్నారు.
ఈ విషయంపై మరోసారి కేంద్ర మత్స్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడతాను.. వీలైనంత త్వరగా వారి స్పందన కొరకై ప్రయత్నిస్తాను అన్నారు ఎంపీ జీవీఎల్.. జరిగిన దురదృష్టకర సంఘటనను విపత్తుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నివారణ నిధులలో కేంద్రం వాటా తొంబై శాతం ఉన్నందున ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న విపత్తు నివారణ నిధుల నుండి నష్టపోయిన బోట్ల యజమానులకు వెంటనే నష్ట పరిహారాన్ని అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి కూడా చేయగల సహాయంపై పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాను అని తెలిపారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.