NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

Bee

Bee

సార్వత్రిక ఎన్నికల రెండో ఘట్టం దగ్గర పడింది. ఏప్రిల్ 26నే రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక విమర్శలు-ప్రతి విమర్శలతో నాయకులు ధ్వజమెత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార-ప్రతిపక్ష నాయకులు పోటీ పోటీగా ఈసీకి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా.. తాజాగా రాహుల్‌గాంధీపై బీజేపీ ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి: Suriya 44: సూర్య సినిమా నటించాలని ఉందా?.. ఇలా చేయండి!

రాహుల్‌గాంధీపై ఎన్నికల సంఘానికి బీజేపీ సోమవారం ఫిర్యాదు చేసింది. భాష, ప్రాంతాల వారిగా రాహుల్‌గాంధీ ప్రజలను విభజించే ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. దేశంలో దక్షిణ, ఉత్తర భారతాల విభజన తీసుకొచ్చే విధంగా రాహుల్‌ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ అన్ని ప్రాంతాలను, భాషలను గౌరవిస్తుందని తెలిపారు. రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం బీజేపీ సీనియర్‌ నేత తరుణ్‌చుగ్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: BJP: ఈశ్వరప్పపై బీజేపీ కొరడా.. ఆరేళ్లు బహిష్కరణ

ఇక కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసి మొత్తం 17 అంశాలపై ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన వ్యాఖ్యల అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.

రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గెలిస్తే ఆస్తులను ముస్లింలకే ఇచ్చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రజల్లో విభజన తీసుకొచ్చేవిధంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోడీ మాట్లాడారని కాంగ్రెస్‌ తన ఫిర్యాదులో తెలిపింది. ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చేలా వ్యవహరించారని, తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపింది. మతం ఆధారంగా మోడీ ఓట్లడిగారని.. విపక్ష పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా లేనిపోని నిందలు వేశారని ఫిర్యాదులో పేర్కొంది.

ఇది కూడా చదవండి: RCB vs KKR: అంపైర్ తప్పుడు నిర్ణయంతోనే ఆర్సీబీ మ్యాచ్ ఓడిందా.. వీడియో వైరల్..

మొత్తానికి కాంగ్రెస్-బీజేపీ పరస్పర ఆరోపణలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నాయి. వీటిపై ఎన్నిక సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

 

Show comments