Site icon NTV Telugu

BJP Kisan Morcha : వ్యవసాయ శాఖ కమిషనర్‌కి బీజేపీ కిసాన్ మోర్చా వినతి

Bjp

Bjp

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9 రైతులకు కానుకగా 2 లక్షల లోపు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానని నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 ముగిసి కొత్త సంవత్సరం వచ్చిన ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడటం లేదని, అదే విధంగా రైతుబంధు పైసలు కూడా రైతుల అకౌంట్లో నేటికీ జమ కాలేదని వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు జమ చేయాలని శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం గత పది సంవత్సరాల లో వ్యవసాయ యాంత్రిక పరికరాలకు సబ్సిడీ ఇవ్వకుండా రైతులను ఇబ్బందుల పాలు చేసిందని ప్రధానమంత్రి పంటల బీమా యోజన కూడా తెలంగాణలో అమలు చేయలేదన్నారు.

ఈ నేపథ్యంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహచర కిసాన్ మోర్చా నేతలతో కలిసి వ్యవసాయ కమిషనరేట్లో కమిషనర్ గోపి కు మెమోరాండం సమర్పించారు. కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఆకాంక్షలను అమలు చేయాలని వ్యవసాయ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి బీజేపీ కిసాన్ మోర్చా బృందం వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, పాపయ్య గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శులు నరసింహారెడ్డి, నిరంజన్, అలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version