Site icon NTV Telugu

BJP Kerala Victory: కేరళలో ఎల్‌డీఎఫ్ కోటను కూల్చిన బీజేపీ..

Bjp Kerala Victory

Bjp Kerala Victory

BJP Kerala Victory: కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) కంచు కోటగా ఉన్న ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఇక్కడ ఎల్‌డీఎఫ్ నాలుగు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంది. రాజధానిలో ఈ అధికార మార్పు లెఫ్ట్ ఫ్రంట్‌కు పెద్ద రాజకీయ దెబ్బగా చెబుతున్నారు.

READ ALSO: Shehbaz Sharif Trolled: ప్రపంచం ముందు పాక్ ప్రధాని నవ్వుల పాలైన 6 సందర్భాలు ఇవే..

నిజానికి తిరువనంతపురం అనేది కేరళ పరిపాలనా రాజధాని మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ముఖ్యమైన ప్రాంతం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఈ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతాన్ని చాలా కాలంగా కాంగ్రెస్, వామపక్ష కూటమికి బలమైన కంచుకోటగా పేరుంది. కానీ తాజాగా మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ ఇక్కడి నుంచి విజయం సాధించడం రాష్ట్రంలో కొత్త చర్చకు కారణం అయ్యింది.

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో 2-3 సీట్లు గెలవడం కంటే బీజేపీ ఈ విజయం చాలా ముఖ్యమైనదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వంటి చోట్ల అధికారం పొందడం అంటే పట్టణ ఓటర్లు రాజకీయ ప్రత్యామ్నాయాలను కోరుకోవడాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ప్రధాన పోటీ LDF, UDF మధ్య ఉండేది. ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా ఈ పోరులోకి ఎంట్రీ ఇవ్వడంతో రాష్ట్రంలో ఈ మార్పు చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటున్నారు. ఎల్‌డీఎఫ్ బలమైన కోట అయిన తిరువనంతపురంలో లెఫ్ట్ ఫ్రంట్ ఓటమిపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

ఈ విజయాన్ని ప్రజల చారిత్రాత్మకమైన తీర్పుగా బీజేపీ అభివర్ణించింది. ఈ ఫలితం కేరళలో బీజేపీకి సంస్థాగతంగా పెరుగుతున్న మద్దతును, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని కమలం పార్టీ నాయకులు అంటున్నారు. తాజా విజయంతో కాషాయదళంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ గెలుపు కేరళలో బీజేపీ భవిష్యత్తు రాజకీయ జీవితానికి బలమైన పునాదిగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలను LDF నాయకత్వం తీవ్రంగా పరిగణించింది, ఆత్మపరిశీలన చేసుకోవాలని నాయకులకు పిలుపునిచ్చింది. ఎన్నికల ఫలితాలను వార్డు స్థాయిలో విశ్లేషించి, అవసరమైతే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ..
తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించినందుకు నగర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా “ధన్యవాదాలు తిరువనంతపురం!” అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కేరళ రాజకీయాల్లో తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల తీర్పును ఒక ” కీలక మలుపు”గా అభివర్ణించారు. ఇక్కడ బీజేపీ-ఎన్‌డిఎకు లభించిన మద్దతు, కేరళ అభివృద్ధి ఆకాంక్షలను తమ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. తిరువనంతపురం వంటి శక్తివంతమైన నగరాన్ని అభివృద్ధి చేయడానికి, సామాన్య ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపరచడానికి తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.

READ ALSO: Pawan Kalyan: కెప్టెన్ దీపిక వినతిపై స్పందించిన డిప్యూటీ సీఎం.. వెంటనే చర్యలు

Exit mobile version