Bilaspur Train Accident: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జిల్లా పరిధిలోని లాల్‌ఖాదన్ సమీపంలోని హౌరా మార్గంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు ఒక సరుకు రవాణా రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత సంఘటనా స్థలంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రమాద తీవ్రతతో అనేక రైలు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ప్రమాదంలో సుమారుగా ఆరుగురు మరణించగా, అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ఉండవచ్చని సమాచారం. కానీ ఇంకా గాయపడిన వారిపై సంఖ్యపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
READ ALSO: YS Jagan: మొంథా తుఫాన్ బాధిత రైతులకు జగన్ పరామర్శ.. కూటమి సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు..
రైల్వే యంత్రాంగం వెంటనే సహాయ బృందాలను, వైద్య విభాగాలను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపింది. స్థానిక యంత్రాంగం కూడా సహాయం కోసం ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా మొత్తం ఈ మార్గంలో రైలు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక రైళ్లను రద్దు చేశారు అలాగే పలు రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దు అయిన రైళ్లలో టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణీకుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ఓవర్ హెడ్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. వీటిని పునరుద్ధరించడానికి సమయం పట్టవచ్చని సమాచారం. ఎక్కువగా రద్దీగా ఉండే బిలాస్పూర్-కట్ని రైలు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
READ ALSO: XPeng Flying Car: కార్లకు రెక్కలు రాబోతున్నాయి.. టెస్లాను బీట్ చేసిన చైనా కంపెనీ!