Site icon NTV Telugu

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో కొత్త పంచాయతీ.. మహా కూటమిలో చీలిక?

Jmm Bihar Exit,

Jmm Bihar Exit,

Bihar Elections 2025: ప్రస్తుతం దేశం చూపు బీహార్‌ వైపు ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష కూటములకు కీలకంగా మారాయి. ఇటీవలే అధికార ఎన్డీఏ కూటమి పక్షాల సీట్ల పంపకం పూర్తి అయ్యింది. ఇప్పుడు ప్రతిపక్ష మహా కూటమి వంతు వచ్చింది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి కాంగ్రెస్, ఆర్జేడీ, జెఎంఎం, ఇతర పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడింది. ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కృతనిశ్చయంతో మహా కూటమి పావులు కదుపుతుంది. కానీ ఊహించని విధంగా బీహార్ ఎన్నికల్లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది.

READ ALSO: Delhi High Court: ఉద్యోగం, జీతం ఉన్న మహిళలకు “భరణం” ఎందుకు..?

రాష్ట్రంలో వేడెక్కిన ఎన్నికల వాతావరణం..
రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తాజాగా మహా కూటమిలో సీట్ల పంపకాల అంశం మరింత వేడిని పెంచింది. మహా కూటమి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) వైదొలిగిందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. వాస్తవానికి దీనిని మహా కూటమిలో చీలికగా భావిస్తున్నారు. ఇప్పుడు జెఎంఎం పార్టీ బీహార్‌లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు స్పష్టం చేసింది. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహా కూటమితో జెఎంఎం తెగతెంపులు చేసుకోవడం ఒక ముఖ్యమైన పరిణామంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బీహార్‌ బీజేపీ ఐటీ సెల్‌కు చెందిన అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిందని, ఇకపై మహా కూటమిలో భాగం కాదని కూడా ప్రకటించిందని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంకా ఆయన తన పోస్ట్‌లో.. బీహార్ ఎన్నికల తర్వాత జార్ఖండ్‌లో కూటమిని పునఃపరిశీలిస్తామని జెఎంఎం పార్టీ పేర్కొన్నట్లు తెలిపారు. రాహుల్, తేజశ్వి అహంకారమే మహా కూటమి విచ్ఛిన్నానికి అసలు కారణంగా ఆయన అభిప్రాయ పడ్డారు.

మరోవైపు ఆర్జేడీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టింది. ఇది మహా కూటమి విచ్ఛిన్నానికి పరోక్ష ప్రకటనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో మహా కూటమి నుంచి జెఎంఎం పార్టీ బయటికి వచ్చినట్లు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

READ ALSO: Peace Of Mind Tips: సంతోషంగా జీవించడానికి ఏం చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?

Exit mobile version