Pallavi Prashanth and Amardeep Fans Fight at Annapurna Studios: బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌గా ప్రశాంత్ రికార్డుల్లోకెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు.. ఇప్పుడు బిగ్‌బాస్ టైటిల్ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్‌దీప్ నిలిచాడు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన అనంతరం అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్‌దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది.
బిగ్‌బాస్ 7 షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు ఆదివారం పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులు వచ్చారు. ప్రశాంత్ విజేతగా నిలవగానే ఆయన ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో అమర్, ప్రశాంత్ అభిమానుల చిన్న గొడవ మొదలైంది. అది కాస్త చినికి గాలివానలా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ.. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు (కొండాపూర్-సికింద్రాబాద్)పై దాడి చేసి.. అద్దాన్ని పగలగొట్టారు.
మరోవైపు ఆదివారం అర్థరాత్రి అన్నపూర్ణా స్టూడియోస్ నుంచి అమర్‌దీప్ బయటకు వస్తున్నాడని తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫాన్స్.. ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. కారు అద్దాలు పగలగొట్టి.. అమర్‌దీప్‌ను బయటకు దిగమంటూ గొడవ చేశారు. దాదాపు అరగంట పాటు కారుపై దాడికి దిగారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతని భార్య, స్నేహితుడు భయభ్రాంతులకు గురయ్యారు. మమ్మల్ని వదిలేయండని అమర్ తల్లి, స్నేహితుడు చేతులు జోడించి వేడుకున్నా.. వారు వినలేదు. కారుని పూర్తిగా ధ్వసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు ఊరట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమర్, ప్రశాంత్ అభిమానుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దాడిలో కారులో ఉన్న అమర్‌దీప్ సహా అతని తల్లి, భార్యకి గాయాలయ్యాయని తెలుస్తోంది. దాడి సమయంలో కారులో నలుగురు ఉన్నారు. ప్రశాంత్‌ని అమర్ తక్కువ చేసి మాట్లాడటమే ఈ గొడవకి కారణం అట. ప్రశాంత్‌తో అమర్ హౌస్‌లో నిత్యం గొడవలు పట్టాడట. అది నచ్చకే అమర్‌దీప్‌పై దాడి చేస్తున్నట్లు ప్రశాంత్ ఫ్యాన్స్ ముందే చెప్పారట. అన్నట్టుగానే అమర్‌దీప్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే దాడి చేశారు.