NTV Telugu Site icon

Vizag MP Family Kidnap Case: కిడ్నాప్‌ కేసులో కీలక ట్విస్ట్.. ప్రియురాలికి రూ.40 లక్షలు

Vizag

Vizag

Vizag MP Family Kidnap Case: విశాఖలో ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్‌ కిడ్నాప్‌ కేసు కలకలం సృష్టించింది.. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా.. ఇప్పటికే ప్రధాన నిందితుడు హేమంత్‌తో పాటు లాయర్ బొమ్మడి రాజేష్, వులవల రాజేష్ అనే వ్యక్తలను అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.. కిడ్నాప్ వ్యవహరంలో పాల్గొన్న మైనర్ బాలురుతో మరికొంత మంది కోసం 7 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.. కిడ్నాప్ చేసిన ముగ్గురిని హేమంత్ గ్యాంగ్ చిత్ర హింసలు పెట్టినట్టు చెబుతున్నారు. బాధిత ఎంపీ ఫ్యామిలీ, ఆడిటర్‌ నుంచి రూ.1.75 కోట్లు వసూలు చేశాడు హేమంత్.. అయితే, ఈ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి.. డబ్బులు వసూలు చేయడడమే కాదు.. అనంతరం ఎంపీ ఇంటి వద్దనే వాటాలు వేసుకోని.. ఆడిటర్ జీవీ చేత తన ప్రియురాలు సుబ్బలక్ష్మికి రూ.40 లక్షలు పంపించాడు హేమంత్‌.. అందులో బెయిల్ కోసం 20 లక్షలు లాయర్ రాజేష్‌కు ఇవ్వాలని తెలిపారు.. జీవీ ఆస్తులను సైతం తనకు రాసివ్వాలంటూ హేమంత్‌ ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది.. కిడ్నాపర్ల నుంచి క్రికెట్ బ్యాట్, కత్తి, 86 లక్షల క్యాష్‌, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు విశాఖ పోలీసులు.

ఇక, విశాఖ ఎంపీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఎలా జరిగింది అనే విషయానికి వస్తే.. ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్‌ వర్మకి ఫోన్ కాల్ చేశారు. గన్నమణి వెంకటేశ్వర రావు అలియాస్‌ జీవీని ఎవరో కిడ్నాప్ చేసినట్లు తనకు అనిపిస్తుందని, తనకు(జీవీ) ఫోన్ చేయగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని అనుమానం కలిగి తమకు ఫోన్ చేశానని తెలిపారు.. తక్షణమే సీపీ.. డి.సి.పి-01(ఎల్&ఓ) విద్యాసాగర్ నాయుడు,డి.సి.పి-02(ఎల్&ఓ) కే. ఆనంద రెడ్డి , డి.సి.పి(క్రైమ్స్)జి. నాగన్న మరియు సిటీ టాస్క్ ఫోర్స్ లతో పలు బృందాలను ఏర్పాటు చేసి నగరమంతా జల్లెడ పడుతూ నగర పరిధిలో గల అందరు క్రిమినల్స్ నూ తనిఖీ చేయమని స్టేషన్ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. సీపీ నగరంతో సరిహద్దు గల జిల్లాల ఎస్పీలతో మాట్లాడి విషయం తెలియజేసి అప్రమత్తం చేశారు. అదేవిధంగా నగర శివార్లలోనూ, ఇతర జిల్లాల సరిహద్దులలోనూ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు.

అయితే, పోలీసులు సాంకేతికతను వినియోగించి ఫోన్ కాల్ సిగ్నల్ ఆధారంగా గన్నమణి వెంకట్(జి.వి) ఋషికొండ వద్ద ఎంపీ నివాస పరిసర ప్రాంతాలలో ఉన్నట్లు గమనించి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో మరింత పరిశీలిస్తుండగా ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఋషికొండ నుండి ఆనందపురం వైపు వెళ్తు రహదారిలో ఒక నలుపు రంగు ఆడి కారు అతి వేగంతో వెళ్లడం పోలీసులు గమనించారు. ఆ వాహనాన్ని వెంబడించగా, బైక్ పై సదరు కారు వేగాన్ని అందుకోలేకపోయారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు, ఇతర జిల్లాల అధికారులకు, ఇతర బృందాలకు తెలిపి నగరమంతా అప్రమత్తం చేశారు.. గాలింపు కొనసాగుతుండగా సుమారు 12:30 గంటల ప్రాంతంలో ఆనందపురం బావుకూరిపేట రోడ్డులో కల పొన్నల పాక వద్ద పోలీసులకు నలుపు రంగు ఆడి కారు కనబడడంతో వెంబడించారు. కారుకు వ్యతిరేక దిశలో మరో పోలీస్ పార్టీ అయిన పద్మనాభం సీఐ ఒక వాహనంలో అడ్డుగా రాగా, సదరు పోలీసు వాహనాన్ని ఢీ కొని వెళ్లిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో.. పోలీసు వాహనాన్ని ఢీకొట్టడంతో ఆడి కారు ప్రక్కకు పడిపోయినది. వెంటనే అందులోని ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చి పరుగులు తీశారు.

ఇక, ఆ ప్రదేశాన్ని రెండు గంటలు పాటు గాలించగా మధ్యాహ్నం 3:30 ప్రాంతములో ఒక కిలోమీటరు దూరంలో ముళ్ల పొదళ్లో ఒక గుంతలో ఇద్దరు వ్యక్తులు గాయాలతో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు వారిని బయటకు తీసి ప్రశ్నించి వారు కోల వెంకట హేమంత్ కుమార్, వులవల రాజేష్ గా గుర్తించారు. అంతటా మధ్యవర్తుల సమక్షంలో వారి స్టేట్మెంట్ లను రికార్డు చేసి, వారిని అధీనంలోకి తీసుకొని, ఆనందపురం పోలీసు స్టేషన్ దగ్గరలో ప్రథమ చికిత్స చేయించి, పీఎం పాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు.. సాయంత్రం 5:30 గంటలకు ఆడిటర్‌ జీవీ మరియు ఎంపీ కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేరిన తర్వాత MLC రిపోర్టు ద్వారా PM పాలెం PS Cr.No 223/23 354 , 324 , 323 , r/w 120 b , r/w 34 IPC, U/s 364 A, 365, 386, 452, 307 ప్రకారం రాత్రి 8.30 గంటలకు FIR జారీ చేశారు.. గాయాలతో దొరికిన కోల వెంకట హేమంత్ కుమార్, వులవల రాజేష్ లు ఈ కేసు నందు ముద్దాయిలుగా గుర్తించి అరెస్టు చేశారు. మూడో ముద్దాయి అయిన బొమ్మిడి రాజేష్‌ను కూడా అరెస్టు చేసి 86.5 లక్షలు రికవరీ చేసి, ముగ్గురునీ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చారు.