NTV Telugu Site icon

Hyderabad: అఫ్జ‌ల్‌గంజ్‌ కాల్పుల ఘటన.. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలింపు!

Hyderabad Police

Hyderabad Police

అఫ్జల్‌గంజ్‌లో బీదర్‌ దొంగల ముఠా కోసం 8 పొలిసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌కు చెందినట్లు పోలీసులు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్‌పూర్‌ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు వందకి పైగా సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలోని బీదర్‌లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయిన విషయం తెలిసిందే. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దుండగులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబందించిన వీడియోస్ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దోపిడీ దొంగలు అఫ్జల్‌గంజ్‌లో ఉన్నట్టు తెలుసుకున్న బీదర్‌ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్‌ వచ్చారు. అప్జల్‌గంజ్‌లో పోలీసులను చూసిన దొంగల ముఠా.. తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం రోషన్‌ ట్రావెల్స్‌ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు ట్రావెల్స్‌ మేనేజర్‌పైన కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత దొంగల ముఠా అఫ్జల్‌గంజ్‌ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వచ్చారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు రోషన్‌ ట్రావెల్స్‌లో రాయ్‌పూర్‌కు 3 టికెట్లు బుక్‌ చేశారు. దాంతో రాయ్‌పూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.