బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్–డ్రామా సిరీస్ ‘దల్దాల్’ నుంచి ఫస్ట్ లుక్‌ను, ఇటీవల గోవాలో జరిగిన.. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫీ)లో విడుదల చేశారు. అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో భూమి డీసీపీ రీటా ఫెరీరా పాత్రలో కనిపించనుంది. ఫస్ట్‌లుక్ విడుదల తర్వాత జరిగిన ‘బియాండ్ ది స్టీరియోటైప్: రీడిఫైనింగ్ ఉమెన్ అండ్ పవర్ ఇన్ మోడ్రన్ స్టోరీ టెల్లింగ్’ అనే స్పెషల్ సెషన్‌లో భూమి పాల్గొని తన పాత్ర గురించి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని భావోద్వేగ క్షణాలను పంచుకుంది.
Also Read : Andhra King Thaluka : శాటిలైట్ నుంచి ఓటీటీ వరకు.. ‘ఆంధ్ర కింగ్ తాలుకా ’ హక్కులపై గ్రాండ్ డీల్!
భూమి మాట్లాడుతూ.. “మహిళల శక్తి ఎప్పుడు బయటకు కనిపించాల్సిన అవసరం లేదు. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, వారి మనసులోని ధైర్యం, పట్టుదల ప్రపంచాన్ని ప్రశ్నించే శక్తిని కలిగి ఉంటుంది. ఇదే విషయాన్ని నేను నా తల్లి లో చూసి నేర్చుకున్నాను” అని చెప్పింది. చిన్నప్పటి నుంచి తల్లి చూపిన ఆంతర్య శక్తి తన వ్యక్తిత్వాన్ని బలంగా తీర్చిదిద్దిందని తెలిపింది. అలాగే ఈ సిరీస్ లో తన పాత్ర రీటా ఫెరీరా గురించి మాట్లాడుతూ, “రీటా పెద్దగా మాట్లాడదు కానీ చాలా చేస్తుంది. మాటల కంటే పనులు పెద్దగా మాట్లాడాలి అనే కాన్సెప్ట్‌ను ఈ పాత్ర మరింత బలంగా నేర్పింది. ఇది నా కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడుకున్న పాత్ర. షూట్ పూర్తయ్యాక కూడా ఈ పాత్ర నుంచి బయటపడటానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ ఈ జర్నీ చాలా సంతృప్తికరంగా అనిపించింది” అని భూమి భావోద్వేగంగా పేర్కొంది.