Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు

Fake Ias

Fake Ias

Fake IAS Officer: భోపాల్‌లో వెలుగుచూసిన నకిలీ ఐఏఎస్ అధికారిణి తృప్తి సింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలపై తృప్తి సింగ్‌పై ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే, న్యాయం చేయాల్సిన పోలీసులే ఈ కేసులో లంచాలకు డిమాండ్ చేశారనే తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ కేసు విచారణ శైలిపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో బైతుల్ ప్రాంతానికి చెందిన ఖ్యాతి అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు అత్యంత కీలకంగా మారింది. ఉద్యోగం పేరిట తృప్తి సింగ్ తనను మోసం చేసిందని భావించిన ఖ్యాతి, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాగ్ సేవనియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసును విచారిస్తున్న ఏఎస్ఐ మనోజ్ శర్మ, కానిస్టేబుల్ సునీల్ రాథోడ్ తమ వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఖ్యాతి ఆరోపిస్తోంది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో, ఆమెనే ఈ కేసులో ముద్దాయిగా చేరుస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు తెలిపింది. గతంలో నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ బ్యాంక్ ఖాతా నుంచి ఖ్యాతి ఖాతాలోకి కొంత మొత్తం జమ కాగా, ఆ విషయాన్నే ఆసరాగా చేసుకుని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె పేర్కొంది.

బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. బాధితులను భయపెడుతున్నారనే విషయమై ఏఎస్ఐ మనోజ్ శర్మ, కానిస్టేబుల్ సునీల్ రాథోడ్‌లపై లంచం ఆరోపణలతో పాటు పలు ఫిర్యాదులు అందాయని ఏసీపీ రజనీష్ కశ్యప్ ధృవీకరించారు. విచారణలో వారి ప్రమేయంపై ప్రాథమిక సమాచారం రావడంతో, ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు వారిద్దరినీ తక్షణమే బాగ్ సేవనియా పోలీస్ స్టేషన్ నుంచి తొలగించి లైన్ అటాచ్ (విభాగపు చర్యలు) చేశారు. ఒకవైపు నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్‌పై బాగ్ సేవనియా పోలీసు స్టేషన్‌లో నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతుండగా, మరోవైపు అదే కేసును విచారిస్తున్న సిబ్బందిపైనే విచారణ ఎదురవడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులపై వచ్చిన లంచం ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది. పోలీసు సిబ్బంది వైపు నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ రానప్పటికీ, ఈ విచారణ పూర్తయిన తర్వాతే ఆరోపణల్లో ఎంతవరకు నిజముందనేది పూర్తి స్పష్టత రానుంది.