Site icon NTV Telugu

Bhogi Festival: భోగి పండుగ ప్రత్యేక ఏంటి..? చిన్న పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు..?

Bhogi Festival

Bhogi Festival

Bhogi Festival: తెలుగు పండుగల్లో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు.. మూడు రోజుల పాటు సాగే ఈ మహాపండుగలో తొలి రోజు భోగి పండుగ.. రెండో రోజు సంక్రాంతి.. మూడో రోజు కనుక జరుపుకుంటారు.. ఆ తర్వాత ముకనుమ అని కూడా నిర్వహిస్తారు.. అయితే, పాతదాన్ని విడిచిపెట్టి.. కొత్తదాన్ని ఆహ్వానించే సందేశంతో భోగి జరుపుకుంటారు. ఈ రోజున జరిగే ఆచారాల్లో అత్యంత ఆకర్షణీయమైనది, భావోద్వేగంతో నిండినది భోగి పండ్లు పోయడం.

భోగి పండుగ ప్రాముఖ్యత ఏంటి?
భోగి అంటే త్యాగం. పాత పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేసి, కొత్త జీవన ప్రయాణానికి శ్రీకారం చుట్టడం ఈ పండుగ అసలు ఉద్దేశం. చలికాలం చివరి దశలో అగ్ని చుట్టూ చేరి వేడి పొందడం ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరం. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజు కావడంతో, ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకునే పండుగగా భోగి నిలుస్తుంది.

ఇంతకీ భోగి పండ్లు అంటే ఏమిటి?
భోగి రోజు చిన్న పిల్లల తలపై పెద్దలు రేగి పండ్లు, చెరకు ముక్కలు, అరటి పండ్లు, పూలు, చిల్లర నాణేలు కలిపి మృదువుగా పోస్తారు.. ఈ ఆచారాన్ని భోగి పండ్లు పోయడం అంటారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక లోతైన భావన ఉంది. పిల్లలు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో, సుఖసంతోషాలతో పెరగాలని పెద్దలు ఆశీర్వదించడమే భోగి పండ్ల ప్రధాన ఉద్దేశంగా చెబుతారు.. ఇక, భోగి పండ్లలో వాడే ప్రతి పదార్థానికి ఒక అర్థం ఉంది.. రేగి పండ్లు – ఆరోగ్యం, బలం.. చెరకు – మధురమైన జీవితం.. నాణేలు – సంపద, ఐశ్వర్యం.. పూలు – సంతోషం, సౌఖ్యంగా చెబుతారు.. ఈ విధంగా పిల్లల భవిష్యత్తుకు శుభాకాంక్షలుగా భోగి పండ్లు మారిపోయాయి..

భోగి పండ్ల వెనుక శాస్త్రీయ కోణం ఉందా?
చిన్న పిల్లలపై భోగి పండ్లు పోయడం వెనుక శాస్త్రీయ కోణం లేకపోలేదు.. రేగి పండ్లు శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. పిల్లల తలపై మృదువుగా పోయడం వల్ల తేలికపాటి మసాజ్ లాంటి ప్రభావం కలుగుతుంది. నాణేలు పడే శబ్దం పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతుందనే అభిప్రాయం కూడా ఉంది.. ఇక, భోగి పండ్లు పోసే సమయంలో బంధువులు, పొరుగువారు, పెద్దలు అంతా ఒక్కచోట చేరుతారు. పిల్లల చుట్టూ కుటుంబమంతా ఉండడం వల్ల ఈ ఆచారం తరం తరాలకు బంధాన్ని బలపరిచే సంప్రదాయంగా మారిపోయింది..

సంస్కృతి–వ్యవసాయానికి ముడిపడ్డ భోగి..
వ్యవసాయ పంటలు ఇంటికి చేరే సమయమే భోగి. ప్రకృతి ఇచ్చిన వరానికి కృతజ్ఞతగా, పండ్లు, చెరకు వంటి పంటలతో భోగి పండ్లు వేయడం మన వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మొత్తంగా భోగి పండ్లు అంటే.. పిల్లల భవిష్యత్తుకు ఆశీర్వాదం.. ఆరోగ్యం–సంపద–సంతోషాల కలయికగా చెబుతారు.. కాలం మారినా, టెక్నాలజీ పెరిగినా.. భోగి పండ్లు పోసే ఆచారం మాత్రం తెలుగు ఇంటి ఆత్మగా నిలుస్తూనే ఉంది.

భోగి పండుగ విశిష్టత ఏంటి?
భోగి అనేది సంక్రాంతి పండుగలలో తొలి రోజు.. ఇది ప్రధానంగా పాతది విడిచిపెట్టి.. కొత్తదాన్ని ఆహ్వానించే పండుగ.. అంటే, పాత వస్తువులు, నిరుపయోగమైన సామగ్రిని త్యజించడం.. కొత్త ఆశలు, కొత్త జీవన విధానానికి స్వాగతం పలకడంగా చెబుతారు.. ఇక, వ్యవసాయ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది.. సూర్యుడి ఉత్తరాయణ ప్రయాణానికి స్వాగతం పలుకుతుంది..

Exit mobile version