తెలంగాణ రాష్ట్రంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని, ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఆయనకు రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధికారులు తకహసి, అండో, కాత్సునో, తనాక తకాషీ తదితరులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విడిగా కానీ ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యానికి పిలుపునిచ్చారు. అంతకుముందు రోహ్మ్ సంస్థ ఉన్నతాధికారులు వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రపంచంలో వివిధ దేశాల్లో తమకు గల సెమీకండక్టర్ల పరిశ్రమలను, అక్కడి ఉత్పత్తి ప్రక్రియలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు. భారతదేశంలో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాలు వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
సాయంత్రం క్విటో నగరానికి సమీపంలో ఉన్న పానాసోనిక్ కంపెనీ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఆ కంపెనీ ప్రెసిడెంట్ నబి నకానీషితో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి వివరిస్తూ తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని భారతదేశంలో కూడా ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈవి వాహనాల సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ బస్సులు కూడా పూర్తి ఈవి వాహనాలుగా చేయాలని సంకల్పించాము కనుక పానాసోనిక్ వారు తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లు తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు
క్విటో నగరానికి సమీపంలో ఉన్న టోజీ బౌద్ధ ఆలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , రాష్ట్ర ఉన్నతాధికారులు గురువారం ఉదయం సందర్శించారు వారికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు పలికారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు.
అమెరికాలో అతిపెద్ద హూవర్ జల విద్యుత్ డ్యామ్ ను సందర్శించిన సందర్భంగా అక్కడ అమలవుతున్న జల విద్యుత్ ఉత్పత్తి విధానాలు, రక్షణ చర్యలు తెలంగాణలో కూడా అమలు జరపాలని ఆయన ఎనర్జీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ను కోరారు. జపాన్ పర్యటనలో యమనాషీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో గ్రీన్ హైడ్రోజన్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి వినియోగించే సాంకేతికతను, సోలార్ విద్యుత్తును నిలువ ఉంచే ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీని పరిశీలించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేపట్టనున్న నేపథ్యంలో ఈ రెండు పద్ధతులపై దృష్టి సారించాలని, తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ వృద్ధికి యమనాషీ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే తోషిబా పరిశ్రమలను సందర్శించి అక్కడ ఉత్పత్తి అవుతున్న అత్యాధునిక ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీటెక్నాలజీని పరిశీలించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ అవసరం ఎంతో ఉంటుందని, అలాగే అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ఉద్దేశం ఉన్నందున ఫ్యూయల్ సెల్స్ ఆవశ్యకత కూడా ఉంటుందని భట్టి పేర్కొన్నారు. తోషిబా వారిని రాష్ట్రంలో ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ, స్వయంగా గానీ ఫ్యూయల్ సెల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అలాగే రోహ్మ్ సెమీ కండక్టర్ల పరిశ్రమను సందర్శించి అక్కడ జరుగుతున్న పలు రకాల సెమీకండక్టర్ లు, హై ఎఫిషియన్సీ బ్యాటరీలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సెమీకండక్టర్లు వంటివి పరిశీలించారు. సోలార్ విద్యుత్ కు ఇతర ఆధునిక పరిశ్రమలకు ఈ అత్యాధునిక సెమీకండక్టర్ల ఆవశ్యకత ఉన్నందున ఈ తరహా పరిశ్రమను తెలంగాణ రాష్ట్రంలో చేయాలని వారిని ఆహ్వానించారు. అలాగే పానాసోనిక్ కంపెనీ వారితో కూడా ఆధునిక ఎలక్ట్రిక్ , ఎలక్ట్రానిక్ పరికరాల పై చర్చించారు.
జపాన్ రవాణా వ్యవస్థ లో కీలక పాత్ర పోషిస్తున్న బుల్లెట్ ట్రైన్ లో ఆయన స్వయంగా ప్రయాణించారు. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ తరహా ట్రైన్ లను రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖకు విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం మీద రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఆయనతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం జరిపిన పర్యటన రాష్ట్ర విద్యుత్ రంగంలో అత్యాధునిక గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు, సింగరేణిలో రక్షణతో కూడిన అధికోత్పత్తి మైనింగ్ పద్ధతుల ఆచరణకు ఊతం ఇవ్వనుంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు డిప్యూటీ సీఎం అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకోనుంది.