బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే నాగార్జున సాగర్ కట్టామన్నారు. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే శ్రీశైలం కట్టామని ఆయన పేర్కొన్నారు. నీకు తెలియదు కాబట్టి కూలి పోయేలా కాళేశ్వరం కట్టావు కేసీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు నీళ్ల గురించి తెలుసు.. కానీ కోట్లు కొల్ల గొట్టడం కేసీఆర్ కి తెలుసు అని అన్నారు. కాళేశ్వరం మీద ఇప్పటి వరకు ఎందుకు నోరు మెడపలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
అంతేకాకుండా.. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవడం కేసీఆర్ కి తెలిసినట్టు మాకు తెలియదని, కాళేశ్వరం.. మేడిగడ్డ మీద ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా పై కుట్ర చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని అన్నారు. బోర్డుకు కేసీఆర్ సర్కార్ నిధులు ఇచ్చిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ కు ఓకే చెప్పేందుకే కేసీఆర్ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పోలేదని అన్నారు.
వీరిద్దరు రహస్యంగా కలిసిన కొన్ని రోజులకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభమైందని చెప్పారు.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకి 27 వేల 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి కల్వకుర్తి, భీమాసాగర్, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదని విమర్శించారు. 95 వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అన్నారు. ఉద్యమ సమయంలో హరీష్ రావు, కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. హరీష్ రావు వేరే వాళ్ల సావుకు కారణం అయ్యారని చెప్పారు.
