Bhatti Vikramarka : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందని, ప్రజలు ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
సభలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతాయని తెలిపారు. వ్యవసాయ భూములు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి రూ.12,000 చెల్లిస్తామని, భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వార్షికంగా రూ.12,000 అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
గ్రామసభలలో లబ్ధిదారుల ఎంపిక
ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో తయారు కాకుండా, గ్రామసభల్లోనే ఖరారు చేస్తామని తెలిపారు. ప్రజల సమక్షంలోనే సంక్షేమ పథకాల అమలు జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ఆసుపత్రి, టూరిజం అభివృద్ధి
మండల కేంద్రం ఎర్రుపాలెంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే, చెరువులు , అడవులను రక్షిస్తూ ఎకో టూరిజం అభివృద్ధి చేపట్టాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభించామని, ఇక్కడ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
బనిగండ్లపాడు సెంటర్ పాయింట్ గా అభివృద్ధి
బనిగండ్లపాడును మండలంలో సెంటర్ పాయింట్ గ్రామంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, దీనిలో భాగంగా శిథిలావస్థలో ఉన్న జూనియర్ కళాశాల పునర్నిర్మాణం, కట్టలేరు బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు విస్తరణ చేపడతామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడైన తొలి రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం..