Site icon NTV Telugu

Bhatti Vikramarka : ఆర్టీసీ పై భారం పడకుండా నిధులు ఇస్తాం

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ఆర్టీసీ విజయవంతంగా అమలు చేయడానికి నిధులు ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా చార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టి.. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)పై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి సంస్థ ఉన్నతాధికారులు వివరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ స్కీం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్ మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా.. రోజు వారీ నిర్వహణకు అవసమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రజల సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా.. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికేటేతర ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు.

Exit mobile version