రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఇవ్వనటువంటి విద్యుత్ నీ రాష్ట్ర ప్రజలకు అందించామని, రాష్ట్రంలో నిన్న విద్యుత్ 15623 మెగావాట్ల వినియోగం అయ్యిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 15497 మెగావాట్ల విద్యుత్ (30.03.2023న) నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ సరఫరా చేశామని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ విద్యుత్ సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. గత పాలకులు వాస్తవాలు పక్కన పెట్టి భ్రమలు కల్పించారని, 2022 డిసెంబర్ లో 200 మిలియన్ యూనిట్లు వాడితే 2023 డిసెంబర్ 207.07 మిలియన్ యూనిట్లు సరఫరా చేసామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం సరఫరా కంటే ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఎక్కువ విద్యుత్ సరఫరా చేసామని, ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చినా తట్టుకుని సరఫరా చేస్తామన్నారు భట్టి విక్రమార్క. మార్చి, ఏప్రిల్ లో ఎక్కువ వాడకం ఉండబోతోందని… 16వేల మెగావాట్ల ఉత్పత్తి, విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరైనా అపోహలు కల్పిస్తే నమ్మొద్దని ఆయన వెల్లడించారు. గత పాలకులు కల్పించిన ఇబ్బందుల నుంచి కూడా బయటపడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కోల్ మినిస్టర్ ను కలిసి తడిచెర్ల బొగ్గు బ్లాక్ గురించి చర్చించామన్నారు. ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని, త్వరలో విద్యుత్ పాలసీని ప్రవేశ పెడతామన్నారు. ఫ్లోటింగ్ సోలార్ కోసం సర్వే చేసాం. త్వరలో రిపోర్టు రాబోతుందని, సోలార్ విద్యుత్ ను ఎలా వాడుకోవచ్చనే అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సర్ ప్లస్ విద్యుత్ ఉండే రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కు ఇబ్బంది లేకుండా ఓ ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నామని, గృహాలక్ష్మీ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
అంతేకాకుండా..’200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. ఉచిత కరెంటు కావాల్సిన వారు ప్రజా పాలన దరఖాస్తు చేసుకోవాలని కోరాము. మీరు ఇచ్చిన రేషన్ కార్డు వివరాలు, సర్వీసు కనెక్షన్ వివరాల ఆధారంగా జీరో బిల్లులు ఇస్తున్నాము. మీరు ఇచ్చిన దరఖాస్తులో ఏదైనా తప్పులు ఉంటే సమీపంలోని ఎంపిడివో ఆఫీసులో సరి చేసుకోవచ్చు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారిని బిల్ ఎవరు అడగరు. ఇబ్బందులు ఉండవు. ఇప్పటి వరకు 40 లక్షల 33 వేల702 మందికి గృహాజ్యోతి జీరో బిల్లును అందజేశాము. మహిళలకు ఇందిరా క్రాంతిపథంను వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం ఈనెల 12న హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వం డిస్కమ్స్ ను ఆగం చేసింది. కాళేశ్వరం, కొన్ని విద్యుత్ ప్రాజెక్టులను నిరర్థక ఆస్తులుగా వదిలి వేయలేము. వ్యవసాయం చేసే రైతులకే రైతుబంధు. భవిష్యత్ లో 5 ఎకరాల వరకు మాత్రమే రైతుబందు ఇస్తాం. 3 నుంచి 4 ఎకరాలు వున్న వారికి ప్రస్తుతం రైతుబంధు ఇస్తున్నాము. కొద్ది రోజుల్లోనే 5 ఎకరాల రైతులకు రైతుబందు వేస్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ చెప్పిన గ్యారెంటీలను అమలు చేస్తూనే ఉన్నాం. నెల మొదటి రోజే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాము. మేము నిబద్ధత, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నాం. పది లక్షల లోపు పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ముందు క్లియర్ చేశాం. 15,071 కోట్లు రైతు భరోసాకు కేటాయింపు చేశాం. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టింది గత ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా బిల్లులు పెండింగ్ లో పెట్టడం లేదు.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
