దేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి. బియ్యం దగ్గర నుంచీ కూరగాయలు.. గ్యాస్.. పెట్రోల్ ఇలా ప్రతిదీ కొనలేని పరిస్థితి. సామాన్యుల దగ్గర నుంచి మధ్య తరగతి కుటుంబాల వారు ఈ ధరలతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు బియ్యం ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మార్కెట్‌లో కిలో రైస్ రూ.40-50 ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.70-80 వరకు అమ్ముతున్నారు. ఈ ధరలతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం భారత్ రైస్‌ను (Bharat Rice) మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకురావాలని భావించింది.
గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పేదలకు ఒరిగిందేమీలేదని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పైగా సార్వత్రిక ఎన్నికల ముందు తాయిలాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ నిరలమ్మ మాత్రం ఉసురు మనిపించారు. ఇంకోవైపు బియ్యం ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో భారత్ రైస్ కార్యక్రమంతో రూ.29లకే కిలో బియ్యాన్ని రిటైల్ మార్కె్ట్ ద్వారా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచే భారత్ రైస్‌ను కిలో రూ.29లకు అందించబోతున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు.
ఈ భారత్ రైస్‌ను నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో ఈ బియ్యాన్ని విక్రయించనున్నట్లు వెల్లడించారు. 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో ‘భారత్ రైస్’ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే భారత్ గోధుమపిండి కిలో రూ.27.50, శనగ పప్పు రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. భారత్ రైస్ విధానంతో సామాన్యులకు ఊరట కల్గుతుందని సంజీవ్ చోప్రా అభిప్రాయపడ్డారు.