Bhadrachalam: భద్రాచలంలో ప్రతీ ఏటా వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి. భక్తులు శ్రీరాముని కల్యాణాన్ని నేరుగా తిలకించేందుకు సెక్టార్ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీరామనవమి వార్షిక కల్యాణోత్సవం కోసం భక్తులు సెక్టార్ టికెట్లను దేవస్థానం వెబ్‌సైట్ bhadradritemple.telangana.gov.in ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Read Also: WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు ఢిల్లీ!
ఇక ఇందులో లభించే రూ.7,500 టికెట్ కు ఇద్దరికి ప్రవేశం కల్పించనున్నారు. వారికీ స్వామివార్ల శేష వస్త్రాలు (చీర, పంచె), 400 గ్రాముల కల్యాణ లడ్డూ, కల్యాణ తలంబ్రాల ప్యాకెట్, సచిత్ర రామాయణ పుస్తకం, అదేరోజు దేవతమూర్తులను దర్శించే అవకాశం కల్పించనున్నారు. ఇక రూ.2,500, 2,000, 1,000, 300, 150 టికెట్ల విషయానికి వస్తే ఇందులో ఒక్కరికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ధరను అనుసరించి కేటాయించిన విభాగంలో దర్శన అవకాశం కల్పిస్తారు.
ఇక శ్రీ సీతారాముల వారి మహా పట్టాభిషేకం ఏప్రిల్ 7న అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఆ రోజు రూ.1,500 టికెట్ తీసుకున్నవారికి ఇద్దరికి ప్రవేశం కల్పిస్తారు. రూ.500, 100 టికెట్ల వారికీ ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్‌లో సెక్టార్ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు మార్చి 20న ఉదయం 11 గంటల నుంచి ఏప్రిల్ 6న ఉదయం 6 గంటల మధ్య భద్రాచలం రామాలయ కార్యాలయంలో (తానీషా కల్యాణ మండపం) ఒరిజినల్ టికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో భక్తులు తమ గుర్తింపు కార్డు, బుకింగ్ వివరాలను చూపించాల్సి ఉంటుంది.
Read Also: Jawahar Nagar: జంట హత్యకేసులో ప్రేమికులు అరెస్ట్
భద్రాచలం రాలేనివారికి కూడా ఆన్‌లైన్‌లో రూ.5,000 చెల్లించి పరోక్ష పూజ నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వీరి కోసం దేవస్థానం స్వామివారికి పూజ నిర్వహించి, కండువా, జాకెట్ ముక్క, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, పటిక బెల్లం ప్రసాదాన్ని వారి చిరునామాకు పంపిస్తుంది. ఇక రూ.1,116 చెల్లించిన వారికి ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, పటిక బెల్లం ప్రసాదం అందజేస్తారు. ఈ సుదీర్ఘ ఉత్సవాల్లో పాల్గొని భక్తులు శ్రీ సీతారాముల వారి అనుగ్రహాన్ని పొందాలని దేవస్థానం అధికారులు పిలుపునిచ్చారు.