హుజురాబాద్ ఉపఎన్నికపై బెట్టింగ్ కోట్లల్లో నడుస్తోంది. ఏ పార్టీ గెలుస్తుంది..ఎన్ని ఓట్ల తేడాలో గెలుస్తుంది..ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు వస్తాయని పెద్దఎత్తున పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో రహస్యంగా కొనసాగుతోంది. ఆఫ్‌లైన్‌లో సైతం బెట్టింగులు సాగుతున్నాయ్. హుజురాబాద్ ఉపఎన్నిక గెలుపు ఓటములపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయి. తెలంగాణకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాల వారు సైతం బైపోల్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ ముగియడంతో పందెంరాయుళ్లు ఉపఎన్నికపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గత నెల నుంచే బెట్టింగ్ మొదలైంది. ఐతే..పోలింగ్ గడువు సమీపించడంతో మరింత జోరందుకున్నాయ్.
తెలంగాణతో పాటు ఆంధ్రా నుంచి విజయవాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు మహారాష్ట్రలోని షోలాపూర్, నాందేడ్, ముంబై వంటి ప్రాంతాల వారు బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక…ఆంధ్రా నాయకులు ఇక్కడ తెలిసిన వారికి ఫోన్ చేసి ఏ పార్టీ గెలుస్తుంది..ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశాలున్నాయంటూ టచ్‌లో ఉంటున్నారు. మరోవైపు…నాలుగు రోజుల క్రితం ఆంధ్రాకు చెందినవారు పలువురు వాహనాల్లో హుజూరాబాద్‌కు వచ్చి ప్రచార శైలిని పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రాలో ఎక్కువ శాతం ఐపీఎల్ బెట్టింగ్‌లు కట్టినవారు అది ముగియడంతో ఇప్పుడు ఉపఎన్నికపై దృష్టి పెడుతున్నట్లు తెలిసింది.
ఇప్పటికే బెట్టింగ్ విలువ 100 కోట్లకుపైగానే దాటినట్లు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్ నిర్వహించే బుకీలు ఆన్‌లైన్‌లోనే దందా నడిపిస్తున్నారు. రూపాయికి 10, కొన్ని చోట్ల రూపాయికి 1000 ఇలా కోట్లాది రూపాయాల బెట్టింగ్ సాగుతోంది. 15 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఏ నలుగురు కలిసినా ఉపఎన్నిక గురించి పెద్దస్థాయిలో చర్చిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ముగిసే సరికి సుమారు 300 కోట్ల బెట్టింగ్‌లు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా వారం రోజుల తర్వాత ఏ పార్టీ గెలుస్తుందో ఎవరు ఓడిపోతారో తెలిసిపోతుంది. ఐతే..అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
