NTV Telugu Site icon

Karnataka Election: కర్ణాటక ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌.. గెలుపెవరిది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?

Karnataka Election

Karnataka Election

Karnataka Election: కర్ణాటక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్‌ ఘట్టం ముగిసింది.. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక ఎన్నికలపై ఆది నుంచి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది.. ఇక, పోలింగ్‌ ముగిసిన తర్వాత.. కర్ణాటకలో గెలుపెవరిది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. పోలింగ్ ముందు వరకు ఒక అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు.. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ చూసి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇంతకు ముందు వేసిన బెట్టింగ్స్ ను కొంత మంది మార్చుకుంటుంటే ఇంకొందరు.. బెట్టింగ్ పెట్టిన మొత్తాలను పెంచేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ బెట్టింగ్ రాయుళ్లు నమ్ముతుండటం విశేషం. ఎందుకంటే బీజేపీనే గెలుస్తుందని ఎంతమంది నమ్ముతున్నారో.. అంతే మొత్తంలో బీజేపీ ఓడి కాంగ్రెస్ గెలుస్తుందని బెట్టింగ్స్ వేస్తున్నారు.

Read Also: Anasuya: ఓ.. ఆంటీ.. నిన్ను పబ్లిక్ ఫిగర్ ను చేసిందే.. మీడియా.. అది మర్చిపోకు

కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్ల కోసం ఎదురు చూస్తున్నారు బెట్టింగ్ బాబులు.. రకరకాలుగా బెట్టింగ్స్ కడుతున్నారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్ ఎన్నిసీట్లు సాధిస్తుంది? జేడీఎస్ పరిస్థితి ఏంటి? కర్ణాటకలో వచ్చేది ఏ ప్రభుత్వం..? సీఎం అయ్యేది ఎవరు? కింగ్‌ ఎవరు? కింగ్‌ మేకర్‌గా మారేది ఎవరు? అనే వాటిపై బెట్టింగ్ జరుగుతోంది. వీటితోపాటు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీద కూడా పందేలు వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసుకున్న కొందరు అంతకు ముందు తాము కట్టిన పందేలలో నష్టపోకుండా ఉండేందుకు రివర్స్ బెట్టింగ్ వేస్తున్నారు. అంటే.. గతంలో ఒక పార్టీ విజయంపై బెట్టింగ్ వేసిన వాళ్లు.. ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకి ఇచ్చిన సీట్లు చూశాక.. డ్యామేజ్‌ కంట్రోల్ కోసం ఇంకో పార్టీ గెలుస్తుందని పందేలు వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను దగ్గర పెట్టుకుని వాటి యావరేజ్ ఎంత? మొత్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావోచ్చు అనే దానిపై లెక్కలు కడుతున్నారు. రాజకీయ విశ్లేషకులను మించిన విశ్లేషణలు చేస్తున్నారు. సందర్భం ఏదైనా.. ఎన్నికలు ఎక్కడ జరిగినా పందేలు వేయడం షరామామూలుగా మారిపోయింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలను కూడా వదలడం లేదు. బెట్టింగ్ వేసిన వాళ్లంతా.. ఫలితాల అంచనాలలో తలమునకలై పోయారు. హైదరాబాద్, ఏపీలోని భీమవరం కేంద్రంగానే గతంలో బెట్టింగ్స్ జరిగేవి. ఇప్పుడు చిన్నా చితకా పట్టణాలకు, గ్రామాలకు సైతం బెట్టింగ్‌ వ్యాపించినట్టు తెలుస్తోంది..

Show comments