NTV Telugu Site icon

Cough : దగ్గు తగ్గడం లేదా.. అదిరిపోయే వంటింటి చిట్కాలు ఇవిగో..!

Cough

Cough

దగ్గు, జలుబు లేకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీలవుతాం. అదే గొంతులో తేడాగా ఉన్నా… ముక్కులో గడబిడ ఉన్నా… క్రమంగా మనం నీరసించిపోతాం. ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే.. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు మనిషిని కుంగదీస్తుంది. ఒక వేళ మీకు దగ్గు ఎక్కువగా వస్తున్నా, ఛాతి వద్ద మంట లేదా భారంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. అయితే.. ఈ వంటింటి చిట్కాలతో కూడా దగ్గు, జలుబులకు చెక్‌ పెట్టవచ్చు.

వాము: పొడి దగ్గు పగటి కంటే రాత్రి సమయంలో ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. నిద్రపట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేసుకుంది నిద్రించే దానికి ముందు చిటికెడు వామును నలిపి, దవడ ని పెట్టుకొని చప్పరించాలి. ఇలా చేయడం వల్ల దగ్గు అదుపులోకి వస్తుంది.

తులసి : జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట తులసి ఆకులను నమలాలి, వీలైతే నీళ్ళలో వేసి మరిగించి కషాయంగా తీసుకోవచ్చు. తులసి కషాయం కఫాన్ని నివారించి ఉపశమనం కలిగిస్తుంది.

దాల్చిన చెక్క : ఇందులో వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌లను ఎదుర్కొనే గుణాలు ఆధికం. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి చప్పరించాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అల్లం : దీంట్లో యాంట వైరల్‌, ఫంగల్‌ గుణాలు అధికం. దగ్గు, గొంతునొప్పి వంటి వాటిని అదుపు చేస్తుంది. అల్లం సన్నగా తరిగి నమలడం, లేదంటే అల్లం టీ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

తేనె : వంటింటి ఔషధాలలో తేనె ఒకటి. అల్లం, లేదంటే నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవాలి. అతిగా కాకుండా పరిమితంగా తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. తేనే, నిమ్మరసం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

మిరియాలు : చిటికెడు, మిరియాల పొడికి చెంచా తేనె చేర్చి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దగ్గు తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఇలా ఉదయం పూట మాత్రమే తీసుకుంటే రోజంతా దాని ప్రభావం ఉంటుంది.

పసుపు : యాంటీ సెప్టిక్‌ గుణాలున్న పసుపు పలు వ్యాధుల్ని నయం చేస్తుంది. జలుబు, దగ్గు విపరీతంగా బాధ ఇస్తున్నప్పుడు గ్లాస్‌ గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.