Site icon NTV Telugu

World Cup 2023: ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని గెలిచినా.. ఐసీసీ ట్రోఫీలను గెలిస్తేనే గొప్ప కెప్టెన్!

Rohit Sharma Captaincy

Rohit Sharma Captaincy

Sunil Gavaskar hopes luck stays with Team India during World Cup 2023: భారత్‌ చివరిసారిగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2013లో ఐసీసీ ట్రోఫీ (ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ)ని గెలిచింది. ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచి అత్యుత్తమ కెప్టెన్ అనిపించుకున్నాడు. మహీ తర్వాత విరాట్ కోహ్లీ సారథిగా వచ్చినా.. మరో టైటిల్‌ భారత ఖాతాలో చేరలేదు. విరాట్ గొప్ప బ్యాటర్ అయినా.. సారథ్యంలో విఫలమయ్యాడు. కోహ్లీ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు అందుకున్నాడు. రోహిత్ సారథ్యంలో ఆసియా కప్‌ 2022, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌, టెస్ట్ ఛాంపియన్ షిప్‌ 2023లో భారత్‌కు చుక్కెదురైంది.

ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్‌ 2023 త్వరలో జరగబోతున్నాయి. ఈసారి స్వదేశంలోనే వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో భారత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా గౌరవం పొందాలంటే.. మెగా టోర్నీల్లో టీమిండియాను విజేతగా నిలపాలి. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని గెలిచినా.. ఐసీసీ ట్రోఫీలను గెలిస్తేనే గొప్ప కెప్టెన్ అవుతాడని పేర్కొన్నాడు. ‘ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని గెలిచినా అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణించేది మాత్రం ఐసీసీ ట్రోఫీలను గెలిపించడం దానిపైనే ఆధారపడి ఉంటుంది. త్వరలో జరిగే రెండు టోర్నీల్లో భారత్‌ను విజేతగా నిలిపితే తప్పకుండా రోహిత్ గొప్ప సారథుల జాబితాలో చేరతాడు. రోహిత్‌కు ఆ సత్తా ఉందని నెను భావిస్తున్నా’ అని సన్నీ అన్నాడు.

Also Read: World Cup 2023: ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును ప్రకటించేది ఆ రోజే!

‘ ఇప్పుడు అందరూ నాలుగో స్థానం గురించి మాట్లాడుతున్నారు. అసలైన సమస్య సరైన ఆల్‌రౌండర్లు లేకపోవడం. 1983, 1985, 2011 ప్రపంచకప్‌ జట్లను గమనిస్తే.. టాప్‌ ఆల్‌రౌండర్లు ఉన్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కనీసం ఏడు లేదా ఎనిమిది ఓవర్లు వేసేవారు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని జట్టును చూస్తే.. యువరాజ్‌, రైనా, సచిన్, సెహ్వాగ్ బౌలింగ్‌ చేయగల సమర్థులు. ప్రతి జట్టుకు ఆల్‌రౌండర్లు ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన టాలెంట్‌తో కూడిన జట్టు ఉన్నా కొంచెం అదృష్టం కలిసిరావాలి. నాకౌట్ స్టేజ్‌లో తీవ్రంగా కష్టపడినా లక్‌ ఉంటే విజయం సాధ్యం. ప్రపంచకప్‌ 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్‌ త్రుటిలో ఓడిపోయింది. మ్యాచ్ రెండో రోజుకు చేరడంతో వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా వేశారు’ అని సునీల్ గవాస్కర్ చెప్పాడు.

 

Exit mobile version