Site icon NTV Telugu

Bear Attack: జూపార్క్‌లో ఎలుగుబంటి దాడి.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి మృతి

Bear Attack

Bear Attack

Bear Attack: విశాఖపట్నంలోని జూపార్క్‌లో ఉదయం విషాదం చోటుచేసుకుంది. జూపార్క్‌లో ఔట్‌ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నగేష్‌ అనే జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్‌ పరిసరాల్లో క్లీనింగ్‌ చేస్తుండగా.. అతనిపై దాడి చేయగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్‌ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తెర్చుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియాల్సి ఉంది. జూలో ఉన్న సందర్శకులు అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడిపై దాడి చేయడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనను గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు. తీవ్రగాయాల పాలైన ఆ ఉద్యోగి నగేష్‌ను ఆసుపత్రికి తరలించగా.. అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనతో జూలోని సందర్శకులు అంతా అయోమయానికి గురయ్యారు. జూలో సిబ్బందికి, సందర్శకులకు భద్రత కరువైందని ప్రజలు భావిస్తున్నారు. ఆరిలోవ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Train Accident: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 3 ఏనుగులు మృత్యువాత

జూపార్క్ ఎలుగుబంటి దాడిలో చనిపోయిన యానిమల్ కీపర్ కుటుంబానికి 10లక్షలు పరిహారాన్ని అటవీశాఖ ప్రకటించింది. రెండేళ్లుగా జూ పార్క్‌లో అవుట్ సోర్సింగ్‌లో మృతుడు నగేష్ పని చేస్తున్నట్లు తెలిసింది. జూ క్యూరేటర్ నందనీ సలారియా ఈ సంఘటన వివరాలను వెల్లడించారు. జూ క్యూరేటర్ నందనీ సలారియా మాట్లాడుతూ.. నగేష్ అనే సంరక్షకుడు ఎలుగుబంటి ఉండే ఎన్‌క్లోజర్ వద్ద క్లీనింగ్‌కు వెళ్ళాడు. అదే సమయంలో ఎలుగుబంటి హెల్త్ చెకింగ్ కోసం వెళ్ళిన డాక్టర్ కీపర్ నగేష్ కోసం వాకబు చేశాడు. అప్పటికే ఎలుగుబంటి తన ఎన్‌క్లోజర్ బయట ఉండడంతో తొలుత దానిని లోపలకు పంపి నగేష్ కోసం వెతకగా ఎన్ క్లోజర్ వెనక తీవ్ర రక్తగాయాలతో పడి ఉన్నాడు. పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చాం. అంబులెన్స్ తెప్పించినా అప్పటికే నగేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోపలకి వెళ్ళినవెంటనే క్లోజ్ చేయకపోవడం వల్లే అది బయటకు వచ్చి నగేష్ పై దాడి చేసింది. నగేష్ మృతి మమ్మల్ని తీవ్రంగా బాధించింది. అటవీ శాఖ తరపున 10 లక్షల ఎక్స్ గ్రేషియాను అందిస్తున్నాం.” అని జూ క్యూరేటర్‌ నందనీ సలారియా పేర్కొన్నారు.

Exit mobile version