Site icon NTV Telugu

IPL 2025: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. షార్ట్‌లిస్ట్‌లో ఉప్పల్ స్టేడియం!

Ipl 2025 Suspended

Ipl 2025 Suspended

హైదరాబాద్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2025 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన షార్ట్‌లిస్ట్‌ జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. ఐపీఎల్ 2025లో మిగిలిన 16 మ్యాచ్‌ల కోసం బీసీసీఐ మూడు వేదికలను షార్ట్‌లిస్ట్ చేయగా.. లిస్ట్‌లో బెంగళూరు, చెన్నై సహా హైదరాబాద్ కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఈ మూడు నగరాల్లో మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రణాళికతో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 మ్యాచ్‌లు ప్రస్తుతానికి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు మ్యాచ్‌లు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. వారం తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమవుతాయని సమాచారం. ఒకవేళ మ్యాచ్‌లు మళ్లీ ప్రారంభమైతే.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో మిగిలిన మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్‌లో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం లీగ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే నిజమైతే హైదరాబాద్‌ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.

ఐపీఎల్ 2025లో ఇంకా 12 లీగ్‌ మ్యాచులు ఉన్నాయి. అలానే రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్‌ మ్యాచ్‌ ఉన్నాయి. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతాలో ఫైనల్‌ మ్యాచ్ జరగాల్సి ఉంది. టోర్నీ నిలిచే సమయానికి పాయింట్ల పట్టికలో గుజరాత్ (16), బెంగళూరు (16), పంజాబ్ (15), ముంబై (14) టాప్ 4లో ఉన్నాయి.

Exit mobile version