Site icon NTV Telugu

BCCI: టైటిల్‌ స్పాన్సర్‌ వేటలో బీసీసీఐ.. ఆ కంపెనీలకు నో ఛాన్స్!

Bcci

Bcci

BCCI Invites Bids for Team India Sponsorship: ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం 2025 పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నేపథ్యంలో టీమిండియా టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి ‘డ్రీమ్‌ 11’ వైదొలిగిన విషయం తెలిసిందే. దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే వేటలో పడింది. ఇందులో భాగంగానే మంగళవారం దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. టీమిండియా స్పాన్సర్‌ షిప్‌ కోసం బిడ్డింగ్‌ ప్రక్రియను ప్రారంభించింది. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసక్తి గల కంపెనీలు పలు నియమ, నిబంధనలకు లోబడి ఉండాలని షరతులు విధించింది.

టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం నియమ, నిబంధనలకు లోబడి ఉండాలని బీసీసీఐ షరతులు విధించింది. కంపెనీలకు ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధాలు ఉండకూడని తెలిపింది. భారత్‌ సహా ప్రపంచంలో ఎక్కడా కూడా అలాంటి సేవలు అందించకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ సంస్థల్లో పెట్టుబడులు కూడా ఉండకూడని పేర్కొంది. క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్ఛేంజ్‌, క్రిప్టో టోకెన్స్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో కూడా కంపెనీలు పాలు పంచుకోకూడదు. పొగాకు, మద్యం, అశ్లీల బ్రాండ్లు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధం విధించింది.

Also Read: Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి, 30 మందికి గాయాలు!

టీమిండియా స్పాన్సర్‌షిప్‌కు సంబంధించిన బిడ్డింగ్‌లో పాల్గొనాలనుకునే కంపెనీల వార్షిక టర్నోవర్‌ కనిష్ఠంగా రూ.300 కోట్లు ఉండాలని బీసీసీఐ తెలిపింది. ఆసక్తి ఉన్న కంపెనీలు తమ దరఖాస్తులను సెప్టెంబర్‌ 16 వరకు సమర్పించాలని బీసీసీఐ పేర్కొంది. యూఏఈ వేదికగా ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానుంది. ప్రధాన స్పాన్సర్‌ లేకుండానే టీమిండియా బరిలో దిగనుంది. మరి బీసీసీఐ ఇన్ని రూల్స్ పెట్టగా.. స్పాన్సర్‌షిప్‌ కోసం ఏ కంపెనీలు పోటీ పడతాయో చూడాలి.

Exit mobile version