India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!

India Vs Rest Of The World Xi

India Vs Rest Of The World Xi

India vs Rest of the World XI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 100వ వార్షికోత్సవానికి ఇప్పుడే సిద్ధమవుతోంది. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం ‘టీమిండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ XI’ మధ్య ఒక భారీ మ్యాచ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన ప్రస్తుతం తీవ్రంగా చర్చల్లో ఉంది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. శతాబ్ది ఉత్సవాల ప్రణాళికలపై జరిగిన ప్రాథమిక చర్చల్లో ఈ సూపర్ ఐడియా బయటకు వచ్చింది. ఈ సంబరాలను ఘనంగా ప్లాన్ చేయడానికి బీసీసీఐ త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆటగాళ్లతో కూడిన అంతర్జాతీయ జట్టుతో భారత్ తలపడటం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. మ్యాచ్ జరిగే తేదీ, వేదిక లేదా ఆటగాళ్ల వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఉత్సవాల పూర్తి రూపురేఖలను బీసీసీఐ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

ఇక, 1928 డిసెంబర్‌లో ప్రారంభమైన బీసీసీఐకి 2028 నాటికి సరిగ్గా 100 ఏళ్లు పూర్తవుతాయి. దీంతో ఈ శతాబ్ది ఉత్సవాలను ఒక్క రోజుకే పరిమితం చేయకుండా, ఏడాది పొడవునా పండుగలా నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ముంబైలో సెప్టెంబర్ 18న జరిగిన ఏజీఎమ్ (అనూహ్య సర్వసభ్య సమావేశం)లో ఈ శతాబ్ది వేడుకలకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. బీసీసీఐ సమాచారం ప్రకారం, ఈ సంబరాలు 2027 డిసెంబర్‌లో మొదలై 2028 అంతటా కొనసాగుతాయి. ఈ ఘనమైన ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రకరకాల కార్యక్రమాలను రూపొందించడానికి, వాటిని విజయవంతంగా నిర్వహించడానికి త్వరలోనే ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగనుంది.

ఒకవేళ ఈ ‘భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ XI’ మ్యాచ్ గనుక ఓకే అయితే, అది క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో వరల్డ్ XI జట్లు గతంలో పలు మ్యాచ్‌లు ఆడినప్పటికీ, టీమిండియాతో అధికారికంగా తలపడటం ఇప్పటివరకు ఒక్కసారి కూడా జరగలేదు. గతంలో వరల్డ్ XI జట్లు ఆసియా XI, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడాయి. అలాగే 2017లో పాకిస్థాన్‌తో మూడు T20ల సిరీస్ ఆడిన దాఖలాలు ఉన్నాయి. ఆ తర్వాత 2018లో కరేబియన్ దీవుల్లో తుఫాను బీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు చారిటీ మ్యాచ్‌గా లార్డ్స్‌లో ఐసీసీ వరల్డ్ XI, వెస్టిండీస్ మధ్య ఒక టీ20I జరిగింది. ఇలాంటి మ్యాచ్‌లు అరుదుగా జరుగుతుంటాయి కాబట్టి, భారత స్టార్ ఆటగాళ్లతో ప్రపంచ క్రికెట్ సూపర్ స్టార్స్ తలపడే ఈ మ్యాచ్ గనుక నిజమైతే బీసీసీఐ 100 ఏళ్ల పండుగకు ఒక అద్భుతమైన మెరుపు తెచ్చిపెడుతుంది. అయితే, ప్రస్తుతానికైతే ఇది కేవలం పరిశీలనలో ఉన్న ఒక ఆలోచన మాత్రమే.