Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం

Banjara Hills Two Fathers Tearful Story

Banjara Hills Two Fathers Tearful Story

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ అందరినీ కదిలించింది. ఒక తండ్రి తన కూతురి స్కూల్ ఫీజు కట్టేందుకు నెల రోజుల పాటు కష్టపడి సంపాదించిన డబ్బును, అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురికి మందులు కొనేందుకు మరో తండ్రి దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన టైలర్ నూరుల్లాఖాన్ తన కుమార్తె స్కూల్ ఫీజు చెల్లించడానికి నెల రోజుల పాటు కష్టపడి రూ. 5 వేలు జమ చేశాడు. ఆ డబ్బుతో నూరుల్లాఖాన్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని జలగం వెంగళరావు పార్కు వద్ద సాదిక్ (39) అనే వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. బైక్ నుంచి పెట్రోల్ లీక్ అవుతోందని చెప్పి నూరుల్లాఖాన్ దృష్టిని మరల్చిన సాదిక్, అతడి జేబులోని రూ. 5 వేల నగదును చాకచక్యంగా తస్కరించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ, వాహనం నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి యాకుత్‌పురాకు చెందిన సాదిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. చెప్పుల దుకాణంలో పనిచేసే సాదిక్, అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు మందులు కొనడానికి చేతిలో డబ్బులు లేక ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. తాను దొంగిలించిన రూ. 5 వేలలో సుమారు రూ. 1,100 తన కుమార్తె మందుల కోసం ఖర్చు చేయగా, మిగిలిన నగదును పోలీసులు రికవరీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఈ ఇద్దరు తండ్రులు తమ కుమార్తెల అవసరాల గురించి చెప్పుకుంటూ కన్నీరుమున్నీరవ్వడంతో అక్కడున్న పోలీసులు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే చట్టప్రకారం నిందితుడు సాదిక్‌ను అరెస్టు చేసిన పోలీసులు, అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు.