Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!

  • బంగ్లాదేశ్ స్పిన్నర్ అలిస్ అల్ ఇస్లామ్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు
  • అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే అరంగేట్ర మ్యాచ్‌లోనే..
  • అతడి బౌలింగ్ యాక్షన్‌పై అధికారులు రిపోర్ట్..
Aliss Al Islam

Aliss Al Islam

Aliss Al Islam Bowling Action: షార్జా వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే ట్రై సిరీస్ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ అలిస్ అల్ ఇస్లామ్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు అనుగుణంగా ఉందా..? లేదా.? అనే అంశంపై మ్యాచ్ అధికారులు రిపోర్ట్ చేశారు. ఇక్కడ అసలు విశేషమేమిటంటే.. ఇదే అలిస్ వన్డే అరంగేట్రం మ్యాచ్.

అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో అలిస్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధతపై మ్యాచ్ అధికారుల నివేదికలో ఆందోళన వ్యక్తమైనట్లు ఐసీసీ వెల్లడించింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం అతడు గుర్తింపు పొందిన టెస్టింగ్ సెంటర్‌లో బౌలింగ్ యాక్షన్ పరీక్షకు హాజరుకానున్నాడు. అయితే పరీక్షను ఎక్కడ నిర్వహించాలనే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతిని వేస్తున్న సమయంలో బౌలర్ మోచేయి గరిష్ఠంగా 15 డిగ్రీల వరకు వంగేందుకు అనుమతి ఉంటుంది. అలిస్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యే వరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ కొనసాగించవచ్చు.

అలిస్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు రావడం ఇదే తొలిసారి కాదు. 2019లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో తన టీ20 అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన సమయంలో అతడి యాక్షన్‌పై తొలిసారి రిపోర్ట్ చేశారు. అదే ఏడాది అక్టోబర్‌లో బీసీబీ నిర్వహించిన దేశవాళీ బౌలింగ్ పరీక్షలో అతడు పాస్ అయ్యాడు. గతేడాది బీపీఎల్‌లోనూ మరోసారి అతడి యాక్షన్‌పై రిపోర్ట్ చేయగా.. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షలోనూ మరోసారి క్లియర్ అయ్యాడు.

రెండు వైపులా బంతిని స్పిన్ చేయగల మిస్టరీ డెలివరీలకు అలిస్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అతడు ఇప్పటివరకు 59 టీ20 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు పడగొట్టగా, ఎకానమీ 6.38గా ఉంది. 20 లిస్ట్-A మ్యాచ్‌ల్లో 18.40 సగటుతో 35 వికెట్లు సాధించాడు. అయితే ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడలేదు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన తన వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో అలిస్ 8.3 ఓవర్లు బౌలింగ్ చేసి 47 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నెల ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన ఆసియా క్రీడల కాంస్య పతక పోరులో అలిస్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.