Bangladesh: గతేడాది ఆగస్టు 05న షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, బంగ్లాదేశ్ నుంచి ఇండియా పారిపోయి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఆమె దేశాన్ని వదలాల్సి వచ్చింది. ఆ తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా దేశాన్ని వదిలిన ఆగస్టు 5న ‘‘విప్లవ వార్షికోత్సవం’’గా జరుపుకోబోతోంది. హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రోజే, ప్రజాస్వామ్య సవరణల జాబితాను విడుదల చేస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం శనివారం తెలిపింది.
Read Also: Kuppam: భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. త్రుటిలో తప్పించుకున్న మహిళలు..
ఈ సంస్కరణలకు సంబంధించి రాజకీయ పార్టీల ఆమోదం కోసం ముసాయిదా కాపీలను పంపారు. ప్రధాన సలహాదారు షఫీకుల్ ఆలం మాట్లాడుతూ..వచ్చే మంగళవారం ఆగస్టు 5 సాయంత్ర 5 గంటలకు జరిగే వేడుకల్లో అన్ని పార్టీల సమక్షంలో ఈ సంస్కరణలను దేశం ముందు ఉంచుతాం అని చెప్పారు. బంగ్లాదేశ్ జాతీయ ఏకాభిప్రాయ కమిషన్ నిర్వహించిన చర్చల్లో, 23 ప్రాథమిక సంస్కరణల్లో 19పై ఏకాభిప్రాయం, నిర్ణయాలు కుదిరినట్లు తెలుస్తోంది. 8 అంశాలపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని, 11 అంశాలపై భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
గతేడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం మొదలైంది. వేలాది మంది నిరసనకారులు హసీనా ప్యాలెస్‌ని ముట్టడించారు. అప్పటికే ఆమె, ప్రత్యేక విమానంలో భారత్ చేరింది. ఈ పరిణామాల తర్వాత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుతీరింది. 2024 వరకు అధికారంలో ఉన్న అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేసయకుండా యూనస్ సర్కార్ నిషేధించింది. ఏప్రిల్ 2026లో ఎన్నికలు జరుపుతామని తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంస్కరణలపై అంతా ఆసక్తి నెలకొంది.
