NTV Telugu Site icon

Bangladesh Captain: షకీబ్‌ అల్‌ హసన్‌ బిజీ.. బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్‌!

Najmul Hossain Shanto Captain

Najmul Hossain Shanto Captain

Najmul Hossain Shanto is Bangladesh New Captain: బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్‌గా స్టార్‌ బ్యాటర్‌ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో శాంటోకు జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) సోమవారం నిర్ణయం తీసుకుంది. తదుపరి 12 నెలలు బంగ్లా కెప్టెన్‌గా శాంటో ఉంటాడని బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ పపోన్ తెలిపారు. ఈ 12 నెలలు శాంటో సారథిగా తానేంటో నిరూపించుకుంటే.. ఆ తరువాత కూడా కొనసాగే అవకాశం ఉంది.

టెస్టు, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ రాజకీయాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన షకీబ్‌ రీఎంట్రీపై అనిశ్చతి నెలకొంది. మరోవైపు అతడు కంటి సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శ్రీలంక సిరీస్‌కు షకీబ్‌ దూరమయ్యాడు. సీనియర్ బ్యాటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతాడో లేదో అన్నది తెలియదు. వన్డే ప్రపంచకప్‌ 2023కు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్‌ తప్పుకోగా.. షకీబ్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ప్రపంచకప్‌ అనంతరం షకీబ్‌ కూడా వన్డే, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి.. టెస్టుల్లో మాత్రమే కొనసాగతానని తెలిపాడు. షకీబ్‌ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా లేదు. ఈ నేపథ్యంలోనే శాంటోను అన్ని ఫార్మట్లలో కెప్టెన్‌గా బీసీబీ నియమించింది.

Also Read: Former Protest Delhi: నేడు రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌.. సరిహద్దుల్లో బారికేడ్లు, కంచెలు!

నజ్ముల్ హొస్సేన్ శాంటో గతంలో బంగ్లాకు కెప్టెన్‌గా చేశాడు. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలోని బంగ్లా సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. అంతకుముం‍దు వన్డే ప్రపంచకప్‌ 2023లోనూ షకీబ్‌ గైర్హజరీలో శాంటో జట్టు పగ్గాలు అందుకున్నాడు. శాంటో సారథ్యంలో బంగ్లా 11 మ్యాచ్‌లు ఆడి.. మూడు గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంక సిరీస్‌తో (మూడు టీ20లు, మూడు వన్డేలు) బంగ్లా పూర్తిస్థాయి కెప్టెన్‌గా శాంటో ప్రయాణం ఆరంభం​కానుంది. శాంటో బంగ్లా తరపున 25 టెస్టులు, 42 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. ఇక కొత్త చీఫ్ సెలెక్టర్‌గా గాజీ అష్రఫ్ హుస్సేన్‌ను బీసీబీ నియమించింది.