Site icon NTV Telugu

Bandi Sanjay Kumar: గ్రూప్-1 అక్రమాలపై రంగంలోకి బండి సంజయ్..!

Telangana Bjp President Bandi Sanjay Kumar Twitter

Telangana Bjp President Bandi Sanjay Kumar Twitter

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. వేలాది మంది అభ్యర్థులు ఆయనను కలిసి గ్రూప్-1 అక్రమాలపై వినతి పత్రాలు అందజేస్తుండటంతోపాటు ఆ నియామకాలను రద్దు చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాలని కోరుతున్న నేపథ్యంలో బండి సంజయ్ గ్రూప్-1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం తెప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, ఫలితాల విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు, తప్పిదాలు జరిగాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ గ్రూప్-1 అభ్యర్థులు పలుమార్లు తన ద్రుష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఝప్తులను, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత టీజీఎస్పీఎస్సీ పైన ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగా గ్రూప్-1 పరీక్ష, ఫలితాలకు సంబంధించి ఈ కింది సమాచారాన్ని వారం రోజుల్లో పంపగలరని కోరుతూ పేజీల లేఖ రాశారు.

Read Also: Pakistan: ‘‘అయోధ్యలో బాబ్రీ మసీదు, అజాన్ పఠించేది పాక్ ఆర్మీ చీఫ్, సిక్కులు యుద్ధం చేయొద్దు’’..

అందులో ప్రధానంగా మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతోపాటు ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లో పంపాలని ఛైర్మన్ ను కోరారు. మరోవైపు హైకోర్టులో గ్రూప్-1 కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో… టీజీపీఎస్సీ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే తాను సైతం కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించారు. అంతిమంగా గ్రూప్-1 అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని భావిస్తున్న బండి సంజయ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అవినీతి, అక్రమాలు, తప్పిదాలకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు జరిగేలా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పలు సందేహాలను వ్యక్తం చేస్తూ వాటిని నివ్రుత్తి చేయాల్సిందిగా టీజీపీఎస్సీ ఛైర్మన్ ను కోరారు. ఆ అంశాలేమిటంటే….

Read Also: Jailer 2: రజనీ కోసం ‘బాలయ్య’ నడిచొస్తే ఉంటది “నా సామిరంగా”!

1. మార్కుల ప్రకటన:
● UPSC తరహాలో ఎంపికైన మొత్తం 563 మంది అభ్యర్థుల పూర్తి మార్కుల జాబితాను(పేర్లతోసహా) అందించగలరు.
●రీకౌంటింగ్ కు ముందునాటి జనరల్ ర్యాంకింగ్ జాబితా (GRL) మరియు ప్రొవిజనల్ మార్కుల జాబితా (PML) అందించగలరు. అట్లాగే నోటిఫికేషన్ యొక్క 15.2, 15.3 నిబంధనలు ఉల్లంఘనకు కారణాలను వివరించగలరు.

అభ్యర్థులకు వచ్చిన మార్కుల జాబితాను మీడియం వారీగా అందించగలరు. ప్రిలిమ్స్ & మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు, పేరు, వయస్సు, మీడియం, లింగం, కేటగిరీ, ప్రతి పేపర్‌కు సంబంధించిన మార్కులు మరియు మొత్తం మార్కులతో సహా తెలియజేయగలరు.

2. మూల్యాంకన ప్రక్రియ:
●గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి మొత్తం దశల సంఖ్య, ప్రతి దశలో ఎవాల్యూయేషన్ జరిగిన రోజుల సంఖ్య, కేంద్రాలు లేదా పేపర్ వారీగా సమాచారం తెలియజేయగలరు. ప్రతిరోజు మూల్యాంకనకు ఉపయోగించిన గంటలు, మూల్యాంకనకారులకు ఇచ్చిన, మారిన సూచనలను తెలియజేయగలరు.

● పదవీ విరమణ పొందిన మూల్యాంకనకారులను ఎంపిక చేసిన ప్రమాణాలు ఏమిటి? బ్లూప్రింట్లు మీడియం స్పెసిఫిక్‌గా ఉన్నాయా లేక కేవలం ఇంగ్లీషులో మాత్రమేనా? ప్రతి పేపర్, ప్రతి మీడియంకు ప్రతి దశలో ఎంత మంది మూల్యాంకనకారులు ఉన్నారు? మూల్యాంకన సమయంలో ఉన్న CCTV ఫుటేజ్ భద్రత స్థితి ఏమిటి? గౌరవనీయ సుప్రీం కోర్టు ఆదేశించినట్లుగా UPSC స్థాయిలో మోడరేషన్ ప్రక్రియను పాటించకపోవడానికి కారణాలను తెలియజేయగలరు.

3. హాజరు వివరాలు:
● జనరల్ ఇంగ్లీష్ మరియు పేపర్లు 1–6కి పేపర్ వారీగా, మీడియం వారీగా హాజరు వివరాలను అందించగలరు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం పాటించబడిందా లేదా? పాటించకపోతే కారణాలేమిటి? నమోదు అయిన హాజరులో ఉన్న వ్యత్యాసాలకు కారణాలను తెలియజేయగలరు.

4. ఫలితాల ప్రకటనకు ముందు డేటా లీక్:
● మార్చి 15, 2025న ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో 450కి పైగా మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్య (618) సోషల్ మీడియాలో పోస్టు చేయబడింది. మార్చి 30న విడుదలైన GRLతో ఇది సమానం. సున్నితమైన డేటా లీక్‌కు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలను తెలియజేయగలరు.

5. కోడ్ ఆధారిత మార్కుల నకిలీ లక్షణాలు:
● 0–50 అంకెల తేడా ఉన్న హాల్ టికెట్ నంబర్ల కలిగిన 1,500కు పైగా అభ్యర్థుల జంటలకు ఒక్కటే మార్కులు రావడం, అంకె పదాంశాల వరకు సరిపోలేదని తెలిసింది. ఇది ఒక కోడెడ్ మార్కింగ్ అల్గోరిథం ఉపయోగించారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. UPSC, APPSC లేదా గత TGPSC పరీక్షలలో ఇలాంటి ధోరణి కనుగొనబడలేదు. దీనికి కారణాలను వివరించగలరు.

6. కేంద్రాల వారీగా అసమాన ఫలితాలు:
● కోఠి ఉమెన్స్ కాలేజ్ (సెంటర్లు 18 & 19) నుంచి ఎంత మంది మెయిన్స్ పరీక్ష రాశారు. వారిలో ఎంత మందికి టాప్ 500లోపు ర్యాంకులు వచ్చాయి? వివరించగలరు. అట్లాగే మిగిలిన కేంద్రాల నుండి ఎంత మంది పరీక్ష రాశారు? వారిలో ఎంత మందికి టాప్ 500లోపు ర్యాంకులు వచ్చాయి. కోఠి ఉమెన్స్ కాలేజీలో పరీక్ష రాసిన వారికే అత్యధిక ర్యాంకులు వచ్చినట్లు మా ద్రుష్టికి వచ్చింది? దీనిపై సమగ్ర వివరాలను అందించగలరు.

7. అదనపు సమాచారం :
● హాల్ టికెట్లు మరియు పరీక్ష కేంద్రాల కేటాయింపు యాదృచ్ఛికంగా జరిగిందా లేక మానవీయంగా కల్పించారా?
● UPSCలో హాల్ టికెట్ నంబర్లు స్థిరంగా ఉండగా, ఇక్కడ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు ఎందుకు మార్పు జరిగింది?
● పరీక్ష కేంద్రాల వారీగా అభ్యర్థుల కూర్చునే పథకం, పర్యవేక్షణకారుల కేటాయింపు వివరాలు.
● పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన CCTV ఫుటేజ్‌ భద్రత స్థితి.
● సమాధాన పత్రాల కోడింగ్ విధానం, మరియు పేరు, జిల్లా కోడ్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎలా నిర్వహించారు?

TGPSCపై ప్రజలలో కొరవడిన విశ్వసనీయత, గతంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీక్ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ వివరాలను ఈ లేఖ అందిన తేదీ నుంచి వారం (7) రోజుల్లోగా సమర్పించగలరని కోరుతున్నట్లు తెలిపారు.

Exit mobile version