Site icon NTV Telugu

Bandi Sanjay: ఎఫ్‌.సి.ఐ. తనిఖీలపై సన్నాయి నొక్కులా?

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాల‌ని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండిసంజ‌య్ లేఖ రాశారు. వరిధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వ‌హించ‌డం స‌రికాద‌న్నారు. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నా మీ ప్రభుత్వం దున్నపోతుపై వాన పడ్డ చందంగా వ్యవహరించిందని అన్నారు. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 74 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించి 20 రోజులు గడుస్తున్నా కేవలం 2500 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారని గుర్తుచేశారు.

ఇప్పటి వరకు కనీసం 10శాతం ధాన్యం కొనుగోలు కూడా జరగలేదన్నారు. ఐకెపి కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో తక్కువ ధరకే దళారులకు పంటను అమ్ముకుని రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆవేన వ్యక్తం చేశారు. ధాన్యం పండించిన రైతులు అకాల వ‌ర్షానికి నిలువునా మునిగార‌ని తెలిపారు. మీ మాట నమ్మి వరి పంట వేయని రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైన, మీ పైన ఉందని గుర్తుచేశారు.

నష్టపోయిన రైతాంగం గురించి ఆలోచించాల్సిన ఆర్థిక శాఖామంత్రి, సివిల్‌ సప్లయ్‌ శాఖామంత్రి, ఇతర మంత్రులు ఎఫ్‌.సి.ఐ. తనిఖీలపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. వారి వ్యవ‌హారం చూస్తుంటే మిల్లర్లతో, టీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు. ఎటువంటి తప్పు చేయకపోతే తనిఖీలపై ఎందుకు ఆ ఉలికిపాటని ప్రశ్నించారు. ధాన్యం అన్‌లోడ్‌కు ముందే మాకిచ్చే కమీషన్‌ తేల్చండంటూ రైస్‌మిల్లర్లు కోరుతుంటే ఎఫ్‌.సి.ఐ. తనిఖీల వల్లే ధాన్యం ఆన్‌లోడ్‌ సమస్య ఏర్పడుతుందంటూ మంత్రులు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఎఫ్‌.సి.ఐ. తనిఖీలు జరిగితే మంత్రిగారికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే భయమా? రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని, తడిసిన ధాన్యాన్ని సైతం కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ ద్వారా డిమాండ్ చేస్తున్నామ‌ని లేఖ‌లో బండి సంజయ్ పేర్కొన్నారు.

Minister Ktr: కాంగ్రెస్ పార్టీకి మంత్రి కేటీఆర్ షాక్

Exit mobile version