Bandi Sanjay: బండి సంజయ్ సమక్షంలో హుస్నాబాద్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచులు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రసంగించారు. ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదని.. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల తరువాత రుణమాఫీ చేస్తామంటే నమ్మేదెవరని ఆయన అడిగారు. ప్రజాసమస్యలను దారి మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని విమర్శలు గుప్పించారు.
Read Also: Amit shah: ఎన్నికల బాండ్ల స్కీమ్‌పై రాహుల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
ఇండియన్ పొలిటికల్ లీగ్‌లో ఐపీఎల్ కప్ మోడీదేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ టీపీఎల్ కప్ బీజేపీదేనన్నారు. కరీంనగర్ లో భారీ మెజారిటీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలారా.. జెండా, అజెండాలను పక్కనపెట్టాలని అన్నారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న మోదీకి మద్దతివ్వాలని సూచించారు. కోర్టులపై అభాండాలు వేయడం నీచమని.. పొన్నం వ్యాఖ్యలు ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని తెలిపారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ ఇష్టానుసారం మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. హుస్నాబాద్ లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయించాలని.. పొన్నం మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు కూడా భయపడే పరిస్థితి నెలకొందన్నారు.